చూడాలా... చేరాలా?
- ఎన్‌ఐటీ సీటు కోసం చూడాలా.. ఎంసెట్ సీటుతో కాలేజీలో చేరాలా!
- ఈ నెల 30న ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చినందుకు సంతోషపడాలా? దాన్ని వదులుకొని ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీటు కోసం ఎదురుచూడాలా?.. ఎటూ తేల్చుకోలేక రాష్ట్రంలోని విద్యార్థులు సతమతమవుతున్నారు. ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థ ల్లో సీటు కోసం ఈనెల 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు పాల్గొన వచ్చని సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 29లోగా కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీల్లో అందజేయాలని స్పష్టం చేసింది.
కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసినందున సర్టిఫికెట్లు ఇచ్చాక కాలేజీలు తిరిగి ఇవ్వవు. అవి లేకపోతే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీల్లో చేరే అవకాశం ఉండదు. దీంతో 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.
6,510 సీట్ల భర్తీకి చర్యలు
జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 6,510 సీట్లను భర్తీ చేయాలని సీఎస్‌ఏబీ (ఛిట్చb.nజీఛి.జీn) నినిర్ణయించింది. ఇందుకు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 30న నిర్వ హిస్తామని ప్రకటించింది. అందులో ఎన్‌ఐటీల్లో 400కు పైగా, ట్రిపుల్‌ఐటీల్లో 2 వేల వరకు సీట్లున్నాయి. మిగతా సీట్లు సెంట్రల్ గవర్న మెంట్ ఫండెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో (జీఎఫ్‌టీఐ) ఉన్నట్లు వెల్లడించింది. వాటిల్లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మంచి కాలేజీల్లో సీట్లు రాని విద్యార్థులు ఆ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రంలో ఎంసెట్ చివరి దశ ప్రవేశాల్లో భాగంగా 22న సీట్ల కేటాయింపును ప్రకటించిన ప్రవేశాల కమిటీ.. 29లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రకటించింది. దీంతో స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటొస్తే.. పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరే గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతున్నారు.
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల షెడ్యూలు ఇదీ..
29–7–2017 సాయంత్రం 4 గంటల వరకు ఫీజు చెల్లింపు
29–7–2017 రాత్రి 11:59 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ (వెబ్ ఆప్షన్లు)
30–7–2017 మధ్యాహ్నం 2 గంటలకు సీట్ల కేటాయింపు
31–7–2017 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్