తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో రెండు రోజులుగా రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం 90,010 మందికి, ఆదివారం 90,662 మంది భక్తులకు గర్భాలయ మూల మూర్తి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులతో రద్దీ పెరిగింది. ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వదర్శనం, కాలిబాట క్యూ, రూ. 300 ఆన్‌లైన్ టికెట్లు, ఆర్జిత సేవలు, వీఐపీ భక్తులు, వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు ఇలా అన్ని క్యూలను దశలవారీగా అమలు చేశారు.
ఆలయంలో కూడా భక్తులకు త్వరగా దర్శనం కల్పించే చర్యలు తీసుకున్నారు. సోమవారం కొంత రద్దీ తగ్గి సాయంత్రం 6 గంటల వరకు 60,501 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం హుండీలో సమర్పించిన కానుకల్ని సోమవారం లెక్కించగా రూ. 2.80 కోట్ల ఆదాయం వచ్చింది.