చేరికలా..చేదుగుళికలా..
విశాఖపట్నం: కొత్త నేతల చేరికలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్దతలనొప్పి తె చ్చిపెడుతున్నాయి.
ఇంతకాలం అధికారంలో వుండి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందుల పాల్జేశారనే విమర్శలెదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు బృందాన్ని అడ్డుకొనేందుకు సీనియర్లు, బీసీ నేతలు ఏకతాటిపైకి రావడంతో పరిస్ధితి గందరగోళంగా మారింది. పీఆర్‌పీ తరపున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్యలను తెలుగుదేశం పార్టీలోేర్చుకొంటే తాము పార్టీని వీడతామంటూ పలువురు బీసీ నేతలు, సీనియర్‌లు హెచ్చరిస్తుండడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాజీ మున్సిపల్ రామారావు నేతృత్వంలోని బీసీ సంఘాల నేతలు మంగళవారం బస్సుల్లో హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలసి పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
గంటా బృందం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం వుండ దని వివరించారు. అనకాపల్లిలో గంటా, పెందుర్తిలో పంచకర్ల తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారని అటువ ంటి వారిని పార్టీలోకి తీసుకొంటే ఎప్పటినుంచో ఉన్న క్యాడర్ దూరమవుతుందనివివరించినట్లు తెలిసింది. ఇక, బుధవారం విజయనగరంలో జరగనున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబును ఈ విషయమై క లసేందుకు నగరంలోని పార్టీ బీసీ నేతలు సిద్ధమౌతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన దేశం పార్టీ విశాఖలో బీసీలను కాదని ఓసీలకు, పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తే పార్టీని వీడేందుకు సిద్ధమని భరణికాన రామారావు నేతృత్వంలోని పలువురు చంద్రబాబుకు స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన పార్టీ ఎంఎల్‌సీ, సీనియర్‌నేత యనమల రామకృష్ణుడును కలసిన బీసీ సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయనతో చర్చించి నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గంటా బృందం తెలుగుదేశంలో చేరకముందే తాము పోటీచేయనున్న అసెంబ్లీ సీట్లపై ప్రచారాన్ని సాగించడం కూడా వివాదాస్పదంగానే మారింది.