సాక్షి, విశాఖపట్నం: సీట్ల పంపిణీలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన సహచరుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తొలుత భీమిలి టికెట్ ఆశించారు. దానికి టీడీపీ అధిష్టానం నిరాకరించింది. తాను భీమిలి నుంచే బరిలోకి దిగుతానని గంటా స్పష్టంచేయగా, తొలుత పార్టీ అధిష్టానం విముఖత చూపింది. గంటా అలకబూనడంతో ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా గంటా ఇంటికి వెళ్లి మరీ ‘పార్టీ అదిష్టానం మాటగా చెబుతున్నా..నీకే భీమిలి సీటు’ అంటూ భరోసా ఇచ్చారు. అయితే అనూహ్యంగా తన కుమారుడు లోకేష్ ను పార్టీ అధినేత చంద్రబాబు తెరపైకి తీసుకు రావడం, ముందుగానే ఓ పథకం ప్రకారం ఓ పత్రికలో ప్రముఖంగా ప్రచురిం చడంపై గంటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గంటా అనుచరగణమే కాదు మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం భీమిలి నుంచి లోకేష్‌ను బరిలోకి దింపడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాగా అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ భేటీల్లో అధినేతచంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను భీమిలి నుంచి బరిలోకిదింపుతున్నట్టుగా తెగేసి చెప్పడంతో గంటాకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరం, గాజువాక, చోడవరంలలో ఏదో ఒకనియోజకవర్గాన్ని ఎంచు కోవాలని సూచించడంతో గంటా తీవ్రఅసంతృప్తి వ్చక్తంచేసినట్టుగా తెలిసింది. పార్టీ అను చరులు, నేతలు ఫోన్లు చేస్తుంటే వారిపై కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్ర బాబు తనను మోసగించాడని, తన కుమారుడి కోసం తన సీటును త్యాగం చేయమంటున్నాడంటూ అసహనం వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. అధినేత ఒంటెద్దు పోకడల పట్ల గంటా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment