వీడిన హరిబాబు హత్యకేసు మిస్టరీ
నెల్లూరు(క్రైమ్): సోదరితో ఓ వ్యక్తి సన్ని హితంగా మెలగడాన్ని ఆమె సోదరులు జీర్ణించుకోలేకపోయారు. రూ.2 లక్షలు సుఫారి ఇచ్చి ఆ యువకుడిని హత్య చేయించారు. కిరాయి హంతకులతో పాటు సోదరుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు రాయపు హరిబాబు హత్య కేసు మిస్టరీని చేధించారు.
పరారీలో ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్ల కోసం గాలింపు చేపట్టారు. వివరాలను నెల్లూరు ఐదో నగర పోలీసుస్టేషన్‌లో సిటీ డీఎస్పీ మగ్బుల్ ఆదివారం విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన ఆమవరపు సుధాకర్, ఏడుకొండలు అన్నదమ్ములు.
కానిస్టేబుల్ అయిన ఏడుకొండలు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పీఎస్‌ఓగా ఉంటున్నాడు. వీరి సోదరి ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది. వితంతువు అయిన ఆమె నెల్లూరులో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన రాయపు హరిబాబు(25) నెల్లూరులో టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఆటోమోబైల్ షోరూంలో పనిచేసేవాడు. ఎక్సైజ్ ఎస్సైతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
ముత్యాలపాళెంలోనే స్నేహితుడి గదిలో ఉండే హరిబాబు తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సంపాదించిందంతా హరిబాబుకే పెడుతోందని సోదరులు పలుమార్లు ఆమెను మందలించారు. ఆమె తీరులో మార్పు రాకపోవడంతో హరిబాబును అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఏడుకొండ లు నెల్లూరుకు చెందిన తన స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ గోను శ్రీనివాసులుతో చర్చించాడు. తన సోదరులు గోను సుబ్బయ్య, గోను ఏడుకొండలుతో హత్య చేయిద్దామని శ్రీనివాసులు హామీ ఇచ్చాడు.
ఈ ఏడాది ఆగస్టులో సుధాకర్, ఏడుకొండలు నిడిగుంటపాళెంలో నిర్వహించిన గ్రామదేవతకు పొంగళ్ల కార్యక్రమానికి గోను శ్రీనివాసులు తన సోదరులతో కలిసివచ్చాడు. అక్కడ అందరూ కూర్చుని హరిబాబు హత్యకు ప్లాన్ చేశారు. గోను సుబ్బయ్య, ఏడుకొండలు రూ.2 లక్షలకు సుఫారి కుదుర్చుకున్నారు. గ్రామంలోనే ఓ ఫ్లెక్సీలో ఉన్న హరిబాబు ఫొటోను తన సెల్‌ఫోన్‌లో బంధించిన సుబ్బయ్య, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాడు. అనంతరం సెప్టెంబర్‌లో గోను ఏడుకొండలుతో కలిసి బైక్ కొనుగోలు సాకుతో హరిబాబు పనిచేసే షోరూంకు వెళ్లారు. ఆయనతో పరిచ యం ఏర్పరచుకుని తర్వాత స్నేహంగా మార్చుకున్నారు. తరచూ మందు పార్టీలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 13న హరిబాబును కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డులోని ఓ దాబా వద్దకు ఆహ్వానించారు. దాబా మూసేసేంత వరకు అక్కడ ముగ్గురూ కలిసి మద్యం తాగారు. అనంతరం మద్యం తీసుకుని సమీపంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు.
తర్వాత హరిబాబు బైక్‌ను అక్కడే వదిలేసి ముగ్గురూ ఒకే బైక్‌పై చలపతినగర్ శివారులోని ఖాళీప్లాట్ల వద్దకు వచ్చారు. అక్కడ హరిబాబును హతమార్చి మృతదేహాన్ని చెట్లపొదల్లో లాక్కెళ్లి పడేశారు. తర్వాత రోజు హరిబాబుకు చెందిన బైక్, పర్సు. వాచ్, సెల్‌ఫోన్ తదితర వస్తువులను ఆమవరపు సుధాకర్, ఏడుకొండలకు ఇచ్చారు. వారు బైక్‌ను తీసుకెళ్లి వెంకటాచలం అడవుల్లో వదిలేశారు. 15వ తేదీ హరిబాబు హత్య వెలుగులోకి రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారించి కేసును చేధించారు.
ఆదివారం వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో గోను సుబ్బయ్య, గోను ఏడుకొండలుతో పాటు ఎక్సైజ్ ఎస్సై సోదరుడు సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కానిస్టేబుళ్లు ఆమవరపు ఏడుకొండలు, శ్రీనివాసులు కోసం గాలిస్తున్నారు. హత్యకేసును చేధించిన ఐదో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ మగ్బుల్ అభినందించారు.