సామాజిక వేడుక
సామాజిక మాధ్యమాలే వేదిక
మువ్వన్నెలద్దుకున్న {పొఫైల్ పేజీలు
ఏయూక్యాంపస్ : సమాచార విప్లవం నేడు మన ముందు దర్శనమిస్తోంది. స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి చేరువయ్యింది. తమ ఆలోచనలు, భావాలను పంచుకునే అవకాశం చిక్కుతోంది. ప్రపంచం అవధులు చెరిపేసే విధంగా ఈ సామజిక మాధ్యమాలు నిలుస్తున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మెసెంజర్ ఇలా నిత్యం సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమాలు ప్రధానంగా యువత ఆలోచనలు పంచుకునే వేదికలుగా నిలుస్తున్నాయి. మనసులోని భావాలను నిర్భయంగా, ఇతరులతో పంచుకునే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటోంది...
రేపటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సామాజిక వేదిక’లపై పండగ చేసుకుంటోంది.
అభిప్రాయాల వేదిక....
అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. భావాలను చేరవేసే వారధి అవసరం. వీటిని తీర్చే విధంగా సాగుతోంది సామాజిక మాధ్యమాల పయనం. స్వాతంత్య్ర దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మాతృదినోత్సవం ఇలా వేడుక ఏదయినా వేదిక మేమంటూ సాగుతున్నాయి. తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్నాయి. ఒకరి అభిప్రాయంతో ఏకీభవించే వారు విబేధించే వారు సైతం మనకు దర్శనమిస్తుంటారు. ఏది ఏమయినా భావాల సంవాదం మాత్ర తధ్యమని తెలుస్తోంది.
స్వాతంత్య్ర స్ఫూర్తి... దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. వీటికి యువతరం ఎంతో ఆసక్తి చూపుతుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందంటే సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ ప్రొఫైల్ పీజీలు రంగులను అద్దుకుంటున్నాయి. తమ భావాలకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు, రంగులను అద్దుతుంటారు. వీటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్టింగ్ చేస్తారు. వేడుకకు వారం రోజుల ముందునుండే పోస్టింగ్‌లు వెల్లువెత్తుతుంటాయి. వీటిలో తమకు నచ్చినని, మనసుకు హత్తుకున్న వాటిని పదే పదే పంపడం సర్వసాధారణ విషయంగా మారుతోంది. వీటికి లైక్‌లు, షేరింగ్‌లకు లెక్కేలేదు.
షేరింగ్ థాట్స్....
గతంలో వ్యక్తులు ఎంతో బిడియంతో వ్యవహరించేవారు. నేడు దీనికి భిన్నంగా ఎంతో స్వేచ్ఛగా భావాలు ప్రకటిస్తున్నారు. తమ ఆలోచనలు పంచుకునే వేదికగా సోషల్ నెట్‌వర్కింగ్ నిలుస్తోంది. మన ఆలోచనలను సులభంగా, తక్కువ సమయంలో ఇతరులతో పంచుకోవడానికి ఇవి వేదికగా నిలుస్తున్నాయి.
- వి.మహేష్, సాఫ్ట్‌వేర్ నిపుణుడు
పరిణతితో ప్రవర్తించాలి....
మన భావాలు ఇతరులను నొప్పించేవిగా ఉండకూడదు. వివాదాలు రేకెత్తించేవిగా, ఇతరుల మనసులను గాయపరిచేవిగా, వ్యక్తిగతమైనవిగా ఉండకుండా చూడాలి. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని పరిధిని గుర్తించి, పరిణతితో కూడిన అభిప్రాయాలను మాత్రమే పంచుకోవడం శ్రేయస్కరం.
- ఆర్.వి.ఆర్ శర్మ,
పరిశోధక విద్యార్థి