చిత్తూరులో పాలకేంద్రం వద్ద భౌతిక దూరం పాటిస్తున్న ప్రజలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌ను మనోబలంతో జయించిన వారు చాలామంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. రోగ నిరోధక శక్తి ఉండి, వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటే ఆ కోవిడ్‌ను ఇట్టే తరిమేయవచ్చనివైద్య నిపుణులు చెబుతున్నారు.
చిత్తూరు అర్బన్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రెడ్‌జోన్లకే పరిమితమవుతోంది. మొత్తం 66 మండలాల్లో 50 గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే రెడ్‌జోన్‌లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పక్క మండలాలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను కట్టడి చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం చెబుతున్న నిబంధనలను తప్పనిసరిగా పాటించడంలో ప్రజా సంకల్పం క్రమంగా సడలుతోంది. ఇప్పటికైనా మేల్కోకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
కేసులన్నీ రెడ్‌జోన్ల పరిధిలోనే..
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 80 నమోదయ్యాయి. ఇందులో ఒక్క శ్రీకాళహస్తి నుంచే 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. 20 రోజుల క్రితమే శ్రీకాళహస్తి రెడ్‌జోన్ పరిధిలోనే ఉంది. ఇక్కడ ఒకరి నుంచి మరొకరికి (కాంటాక్టు కేసులు) పెరగడంతో దీన్ని అదుపులో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను రంగంలోకి దించింది. మరెవ్వరికీ వైరస్ సోకకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన 30 కేసులు 12 మండలాలు, రెండు అర్బన్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అంటే జిల్లాలోని 50కు పైగా మండలాలు ఇంకా గ్రీన్‌జోన్‌లోనే ఉన్నాయి.
ప్రజల్లో మార్పేది..?
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. రెడ్‌జోన్ ప్రాంతాలకు ప్రత్యేకాధికారులను పంపడంతో ఈ ప్రాంతాలను పూర్తిగా లాక్‌డౌన్ చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఎక్కడో వైరస్ వ్యాప్తి చెందింతే మాకేంటి అన్నట్లు మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె లాంటి పట్టణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కొనుగోలు నుంచి రాత్రులు సైతం వాహనాల్లో తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు వాడకుండా రోడ్లపైకి వస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఆందోళన వద్దు
జిల్లాలో కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందొద్దు. ఎక్కడికక్కడే ఈ చైన్‌ను తెంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. జలుబు, జ్వరం వచ్చిన వాళ్లందరికీ కరోనా వచ్చినట్లు కాదు. సొంతంగా మందులు వాడొద్దు. లాక్‌డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే కరోనాకు అడ్డుకట్ట పడుతుంది. – ఎన్.భరత్‌గుప్త, కలెక్టర్
సహకరించండి...
లాక్‌డౌన్ పెట్టింది మన ల్ని మనం రక్షించుకోవడానికి. ఇది ఎవరి కోసమో కాదు. వైరస్ ప్రబలకుండా ఉండాలంటే పోలీసు ల సూచనలను పాటించి సహకరించండి. ఇప్పటివరకు జిల్లాలో 36 వేల వర కు ఉల్లంఘన కేసులు పెట్టాం. దీన్ని జీరో చేయాలంటే ఎవ్వరూ కూడా అనవసరంగా రోడ్లపైకి రావొద్దు. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు
ధైర్యమే మందు
కోవిడ్ బారినపడితే భయపడాల్సింది ఏమీ లేదు. జిల్లాలో ఇప్పటికే 21 మంది ఈ వ్యాధి నుంచి పూర్తి గా కోలుకున్నారు. పాజిటివ్ వచ్చినా కూడా భయపడాల్సిందేమీలేదు. ధైర్యంగా చికిత్స చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడంతోనే వ్యాధి నయమవుతుంది. – డాక్టర్ సరళమ్మ, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయాధికారిణి, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment