తోట రాజేశ్, రోదిస్తున్న ఆయన భార్య
సాక్షి, గుడివాడ/బద్వేల్: సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై చంద్రబాబు సర్కారు కన్నెర్ర జేస్తోంది. పార్టీ మారిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణతో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తోట రాజేశ్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
అంతకుముందు గుడివాడలో హైడ్రామా చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పోలీసులు పేరుతో ఐదుగురు వ్యక్తులు రాజేశ్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి స్టేషన్‌కు రప్పించారు. గుడివాడ రెండో టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చిన రాజేశ్‌ను రాత్రికి రాత్రే వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు తీసుకెళ్లారు. రాత్రి నుంచి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. రాజేశ్‌ను రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజేశ్ అరెస్ట్‌పై అధికారికంగా సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకుముందు కూడా రవీంద్ర ఇప్పాల, ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికంగా ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై ఏపీ సర్కారు అవలంభిస్తున్న వైఖరిని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు.