సుజాత.. సేవా బాట | Social Service Sujatha Special Story West Godavari | Sakshi
Sakshi News home page

సుజాత.. సేవా బాట

Published Tue, Jan 29 2019 8:00 AM | Last Updated on Tue, Jan 29 2019 8:00 AM

Social Service Sujatha Special Story West Godavari - Sakshi

వృద్ధులకు పింఛన్‌ అందిస్తున్న లక్కోజు సుజాత (ఫైల్‌)

మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని అక్షర సత్యం చేస్తున్నారు ఆమె. ఓ పక్క జీవన పోరాటం. మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవ చేయడానికి ప్రాంతంతో సంబంధం లేదని నిరూపిస్తూ తాను ఎక్కడుంటే అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ఇలా 20 ఏళ్లుగా జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన లక్కోజు సునీత.

పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం రూరల్‌ : తనకున్న దానిలో పదుగురికి సేవ చేయాలనే సంకల్పం, బిడ్డ నుంచి పొందిన స్ఫూర్తి వెరసి ఆమెను సామాజిక సేవా కార్యకర్తగా మలిచింది. మొక్కవోని దీక్షతో కృషి సల్పి తాను ఎక్కడున్నా తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు లక్కోజు సుజాత. పెద్ద కుమార్తె భార్గవి ఉద్యోగ రీత్యా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఉపాధ్యాయినిగా పనిచేయడంతో స్థానికంగానే నివాసముంటున్నారు.   లక్కోజు సుజాత సాధారణ గృహిణి. డిగ్రీ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు దాంపత్య జీవితం సజావుగా సాగినా అరమరికలు కారణంగా భర్త నుంచి వేరుపడ్డారు. అయినా ఏమాత్రం ఆత్మనూన్యతకు లోనుకాకుండా శ్రమకోర్చి పిల్లలను పెంచి పెద్దచేశారు. ఓ పక్క ఎల్‌ఐసీ ఏజెంట్‌గా మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. పిల్లలను విద్యావంతులను చేశారు. పెద్ద కుమార్తె భార్గవి దివ్యాంగులురాలైనా ఎంఏ హిందీ, పండిట్‌ ట్రైనింగ్‌ చేసి వీరంపాలెం హైస్కూలులో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె అనూష సముద్ర ఉత్పత్తుల (సీఫుడ్‌) కంపెనీలో నాణ్యతా విభాగంలో పనిచేస్తున్నారు. కుమారుడు పవన్‌ డిగ్రీ పూర్తి చేసి రైల్వే ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు.  

బిడ్డ నుంచి స్ఫూర్తి
సుజాత పెద్ద కుమార్తె భార్గవి పుట్టిన పదకొండు నెలల వయసులోనే పోలియో బారిన పడి దివ్యాంగురాలు కావడం ఆమెను ఎంతగానో కలచివేసింది. కదల లేని స్థితిలో తన బిడ్డపడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని భావించి 1999లో వివేకానంద వికలాంగ సంక్షేమ సంఘాన్ని ఏలూరులో నివాసం ఉండగా ఏర్పాటుచేశారు. ఈ సంఘం ద్వారానే తన తొలి అడుగు ప్రారంభించారు. ఏలూరులో ఉంటూ ఓపక్క జీవన పోరాటం చేస్తూనే మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిçస్తూ వచ్చారు. పేద విద్యార్థులకు విద్యాపరంగాను, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ, దివ్యాంగులైన పిల్లలకు తన సొంత నిధులు వెచ్చించి ఆపరేషన్లు చేయించడంలోనూ ఆమెతో పాటు పలువురు దాతలను సైతం భాగస్వామ్యం చేస్తూ వస్తున్నారు. దాదాపు 100 మంది దివ్యాంగులకు తిరుపతి బర్డ్స్‌ ఆస్పత్రిలో ఆపరేషన్లు సైతం చేయించారు.  తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో అభ్యాస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అశోక్‌కుమార్‌ సహకారంతో సుజాత సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలంతో పాటు నల్లజర్ల, దేవరపల్లి, కొయ్యగూడెం మండలాల్లో వివిధ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు.

అవార్డుల పరంపర
సుజాత చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులను సైతం అందజేశాయి. 2001–2002లో జంగారెడ్డిగూడెంలో జరిగిన విజ్ఞాన, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులకు అన్నివిధాలా సహకరించినందుకు గాను, 2012లో జిల్లా సాంస్కృతికశాఖ నుంచి, 2018 నవంబర్‌ 25న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండో–నేపాల్‌ సమరసత్తా ఆర్గనైజేషన్‌ నుంచి ఇండో–నేపాల్‌ ఏక్తా అవార్డును, అదే ఏడాది ఎక్కువసార్లు రక్తదానం చేసినందుకు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఉత్తమ రక్తదాతగాను ఇలా పలు అవార్డులను సైతం లక్కోజు సుజాత అందుకున్నారు. 1990–92లో అయోధ్యలో భవ్యనవ్య రామమందిర నిర్మాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కరసేవకు ముందుకు ఉరికిన సైనిక సమ్మేళనం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలో పురిఘళ్ల రఘురామ్‌ చేతులమీదుగా 2017లో జ్ఞాపికను అందుకున్నారు. చిత్ర కళాకారిణిగా, అక్షర దీక్ష వలంటీర్‌గా, జిల్లా విద్యాకమిటీ సభ్యురాలిగా కూడా సుజాత సేవలందించారు. ఈసందర్భంగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.

శ్వాస ఉన్నంత వరకు..
తాను, తన బిడ్డ పడుతున్న కష్టాలు సమాజంలో మరెవ్వరూ పడకూడదన్నదే ఆకాంక్ష. ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా విద్యాపరంగా, జీవనపరంగాను అవస్థలు ఎదుర్కొంటుంటే అటువంటి వారు తనను సంప్రదిస్తే చేతనైన సాయం చేస్తున్నా. బిడ్డలను ప్రయోజకులను చేశాను. నాడు నా బిడ్డ నడవలేని స్థితిలో ఉండగా ఏలూరుకు చెందిన అడ్డగర్ల రామ్మోహన్‌ ప్రోద్బలం, కృషితో ఇప్పుడు స్టిక్‌తో నడుస్తోంది. ఆయన చేసిన సాయం మరువలేను. నేను కూడా ఇలాంటి సాయాలను శ్వాస ఉన్నంత వరకు కొనసాగిస్తా.  – లక్కోజు సుజాత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement