- వచ్చే నెల 10న నిర్వహణ
- నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో గతంలో నిలిచిపోయిన 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలకు ఆదివారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10న వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలోని 98 పీఏసీఎస్‌లకు 2012లో ఎన్నికలు జరిగాయి. ఇందులో నక్కపల్లి సొసైటీ ఎన్నికను నామినేషన్ల స్వీకరణకు ముందే నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎన్నికకు ముందు రోజున మరో 12 సొసైటీల పోలింగ్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో నిలిచిపోయిన 13 సంఘాల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పే ర్కొంది. దీంతో నక్కపల్లికి పీఏసీఎస్‌కు మాత్రం ఈ నెల 28 ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుంది. 31న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 1న పరిశీలన, 2న ఉపసంహరణ ఉంటాయి. దీంతో పాటు మిగిలిన 12 పీఏసీఎస్‌లకు మాత్రం ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉం టుంది. అరకు, పెందుర్తి, లంకెలపాలెం,గౌరీ(అనకాపల్లి), తుమ్మపాలెం, సబ్బవరం, శొంఠ్యాం,బుచ్చెయ్యపేట,కె.కోటపాడు,రాయపురాజుపేట,లక్కవరం, నక్కపల్లి, చోద్యం సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.