‘సాఫ్ట్’గా ప్రచారం.. ముంచుకొస్తున్న ముప్పు..
అమీర్‌పేటలో శిక్షణ
సంస్థల ప్రచార హోరు
వీధులు కనబడకుండా బ్యానర్లు
మురుగు ప్రవాహానికి
అడ్డుగా కరపత్రాలు
సనత్‌నగర్, న్యూస్‌లైన్:
అమీర్‌పేటలో ‘సాఫ్ట్’ ప్రచారం హడలెత్తిస్తోంది. కరప్రతాలు రోడ్లను సైతం కనిపించకుండా చేసేస్తుంటే.. బ్యానర్లు వీధులను ముంచేస్తున్నాయి. చిన్న చోటు కనిపిస్తే ప్రచార కోసం సాఫ్ట్‌వేర్ శిక్షణ కేంద్రాలు వాలిపోతున్నాయి. అమీర్‌పేట్ మైత్రీవనమ్ నుంచి సత్యం థియేటర్ రోడ్డు, మైత్రీవనమ్ వెనుక ప్రాంత రహదారులను ఒక్కసారి పర్యటిస్తే ఏ వీధిలో ఉన్నామో తెలియని అయోమయంగా ఉంటుంది. రోడ్లను అపరిశుభ్రంగా మార్చడంతో పాటు వీధులను కానరాకుండా చేస్తున్న సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థల ప్రచార అస్త్రాలపై అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది.
మురుగు పారుదలను అడ్డుకునేలా..
అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో దాదాపు మూడు వేలకు పైగా సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థలు ఉండగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు కొత్తగా వచ్చేవారు వేలల్లో ఉంటారు. వీరిని ఆకర్షించేందుకు ఆయా శిక్షణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో కోర్సుల వివరాలతో ముద్రించిన వేలాది కరప్రతాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎవరికి నచ్చిన రీతిలో వారు చేస్తుంటారు. ఒక్క కరపత్రాలనే గమనిస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో దాదాపు వంద మంది వరకు కేవలం పంచడానికే విధులు నిర్వర్తిస్తారు. ఈ కరపత్రాలను అక్కడికక్కడే పడేస్తుంటారు. ఇలా రోజుకు ఐదు క్వింటాళ్ల కరపత్రాలే ఇక్కడ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, వర్షానికి, గాలికి కాగితాలన్నీ మురుగనీటి మ్యాన్‌హోల్‌ల్లోకి చేరి మురుగు ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో రోడ్డుపైకి మురుగు పొంగుకు రావడం నిత్యకృత్యంగా మారింది. ఇదిలా ఉంటే స్తంభాలకు అడ్డదిడ్డంగా కడుతున్న బ్యానర్లు వాహనదారులకు అసౌకర్యంగా మారుతున్నాయి.
కమిషనర్ ఆదేశాలూ బేఖాతర్..
ఇక్కడి పరిస్థితిపై గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న కృష్ణబాబు స్వయంగా పరిశీలించి సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రచారతీరుపై మండిపడ్డారు. వీటి ప్రచార నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఆయన ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ పర్యటించి బ్యానర్లు, బోర్డుల తొలగింపునకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెండు మూడు రోజులు బోర్డులను, బ్యానర్ల తొలగించిన సిబ్బంది ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో సమస్య యధాస్థితికి వచ్చింది. సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రచారం చేసుకోవడానికి కింది స్థాయి సిబ్బందికి, నేతల చేతులు తడుపుతుండడం వల్లే వాటిని అడ్డుకోవడం లేదనే విమర్శలూ తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా బోర్డు, బ్యానర్ల ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి. ఇదంతా ఎందుకనుకుని శిక్షణ సంస్థలు కిందిస్థాయి సిబ్బందిని, నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. దీంతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి సైతం గండిపడుతుండడంతో పాటు నీటిపారుదలకు అడ్డంకి సృష్టించేలా కరపత్రాలు కొట్టుకురావడంతో ముంపు సమస్య ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.