మృదుమధురమైన భాష తెలుగు | Soft lilting language Telugu | Sakshi
Sakshi News home page

మృదుమధురమైన భాష తెలుగు

Published Sun, Jan 26 2014 2:17 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

Soft lilting language Telugu

ఈడే పల్లి(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : నుడికారాలు, అలంకారాలు, చందోగణాలతో వర్థిల్లుతున్న మృదుమధురమైన భాష తెలుగు అని కృష్ణా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎంకే దుర్గాప్రసాద్ అన్నారు. సాహితీ మిత్రులు సంస్థ 33వ వార్షికోత్సవం శనివారం బచ్చుపేటలోని మహతి లలిత కళావేదికపై ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్ ప్రముఖ ర చయిత్రి వారణాసి సూర్యకుమారి రచించిన ‘సప్తపది’ నవలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ వివాహ ధర్మాల్ని, ప్రయోజనాల్ని వివరిస్తూ సూర్యకుమారి రాసిన ఈ గ్రంథం అద్భుతంగా ఉందన్నారు.

డాక్టర్ గురజాడ రాజేశ్వరి గ్రంథ సమీక్ష చేశారు. సామితీ మిత్రులు కవితల సంకలనం ‘సుకవి స్వరాలు’ గ్రంథాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై.కృష్ణారావు ఆవిష్కరించారు. సింహాద్రి పద్మ గ్రంథ సమీక్ష చేశారు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు జి.సుబ్బారావు, సిటీ కేబుల్ మేనేజర్ బి.పుల్లారావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కైకలూరు మండలం భుజబలపట్నం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శ్రావణ లక్ష్మి, గిరిజాతులసి, దేవీప్రశాంతి, శిల్పాదేవి, తెలుగు పండితులు కేవైఎల్ నరసింహం, మేరీ కృపాబాయి, కె.కనకదుర్గ, పి.వెంకటేశ్వరరావు, టి.రాధికారాణి నిర్వహించిన పద్య ప్రజ్ఞావధానం ఆహూతులను ఆకట్టుకుంది.

అనంతరం కవిత, సంఘసేవ, కళాసేవలో కృషిచేసిన కావలి కోదండరావు(ఒడీశా), యు.శ్రీనివాసరావు, మహ్మద్ అబ్దుల్ గఫార్‌లకు వామన కవిత ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ రావి రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వి.పూర్ణచంద్రరావు, కార్యదర్శి ఆదుమర్తి సుహాసినీ, ఉపాధ్యక్షురాలు కె.కల్పన, కోశాధికారి ముదిగొండ సీతారావమ్మ, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, సీహెచ్ ప్రమీల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement