మృతుడు పార్లపల్లి సుబ్బారెడ్డి (ఫైల్)
పొదలకూరు (నెల్లూరు): బెంగళూరులో జరిగిన రైలు ప్రమాదంలో మండలంలోని నల్లపాళెంకు చెందిన యువ సాప్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు వివరాలు.. ఆరునెలల క్రితం పార్లపల్లి సుబ్బారెడ్డి (27) బెంగళూరులోని సాప్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. ఈనెల 1వ తేదీ నుంచి అతను కనిపించడం లేదని కుటుంబసభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. అప్పటినుంచి వారు బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి విచారించడంతో సుబ్బారెడ్డి రైలు ప్రమాదంలో మృతిచెందినట్టు తెలిసింది. వెంటనే బంధువులు, స్నేహితులు మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు.
ఒక్కడే కుమారుడు
నల్లపాళెంకు చెందిన పార్లపల్లి శేషారెడ్డికి సుబ్బారెడ్డి ఒక్కడే కుమారుడు. గతంలో అతను కేరళలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. తర్వాత ఇంటికి వచ్చేసి మళ్లీ ఆరునెలల క్రితం బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. ఉదయం కంపెనీకు వెళ్లే క్రమంలో లోకల్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయి సుబ్బారెడ్డి మృతిచెందాడు. అయితే రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించినా సరైన వివరాలు లభ్యం కాక వీలుపడలేదు.
దీంతో వారు పోస్ట్‌మార్టం నిర్వహించి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. సుమారు వారంరోజులుగా సుబ్బారెడ్డి కనిపించకపోవడంతో స్నేహితులు, కుటుంబసభ్యులు హైరానపడి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా అనుమానించారు. చివరకు అతను మృతిచెందాడని తెలుసుకుని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సుబ్బారెడ్డికి తల్లిలేదు. తండ్రి పెంచాడు. అవివాహితుడైన కుమారుడి మరణవార్త తెలుసుకుని శేషారెడ్డి బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment