bangulur
-
ప్రియురాలితో నటుడి వివాహం
సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు వినాయక్ జోషి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజం ఆచారాల ప్రకారం పరస్పరం ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలన పాటిస్తూ నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, అభిమానుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వినాయక్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు వినాయక్, వర్షాలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షా బెలవాడి జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వర్షా బాడ్మింటన్ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక్, వర్షా చిన్ననాటి స్నేహితులు. ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట డాన్స్ నేర్చుకున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఇక సినిమాలో విషయానికి వస్తే.. హీరో వినాయక్ 70 సినిమాల్లో నటించారు. అమృతా వర్షిని, లాలి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. అదే విధంగా బిగ్ బాస్ కన్నడ సీజన్3లో వినాయక్ పాల్గొని సందడి చేశారు. -
గోల్డెన్ చారియట్ మళ్లీ షురూ
న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో అత్యంత విలాసవంతమైనదిగా పేరున్న గోల్డెన్ చారియట్ రైలు పునఃప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి గోవా వరకు వెళ్ళే ఈ రైలు దేశవిదేశీ టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ రైలులో 18 బోగీలుంటాయి. 84 మందికి సరిపోయే 44 గెస్ట్ రూములున్నాయి. అయితే ఈ రైల్లో ప్రయాణించే వారి సంఖ్య అతి తక్కువగా ఉండడంతో గత మార్చిలో దీన్ని రద్దు చేశారు. కొత్తగా నిర్ణయించిన రైలు వేళలు, టికెట్ ధరలు మరో వారంలో వెల్లడిస్తామని ఐఆర్సీటీసీ చెప్పింది. మొదట నెలకి రెండుసార్లు రాకపోకలు ప్రారంభించనున్నట్టు కెఎస్‌టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పుష్కర్ తెలిపారు. గతంలో ఈ రైలు చార్జీ రూ. 43 వేలు (600 అమెరికన్ డాలర్లు)గా ఉండేది. బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ రైలు బందిపూర్, మైసూర్, హలేబిద్, చిక్‌మంగుళూరు, హంపీ, బీజాపూర్‌ల మీదుగా గోవాకి చేరేది. ఇప్పుడు కూడా ఇదే మార్గంలో దీన్ని నడపనున్నారు. -
బడ్జెట్‌పై చర్చ.. రచ్చ రచ్చ
బెంగళూరు: బడ్జెట్‌పై బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో జరిగిన చర్చ రసాభాసగా మారింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సోమవారం బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలో పాలికె కౌన్సిల్ సభ ప్రారంభం కాగానే బీబీఎంపీ బడ్జెట్‌పై పాలికె పాలన విభాగం నేత అబ్దుల్ వాజిద్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం బృహత్ బెంగళూరు మహానగర పాలికె బడ్జెట్‌ను అడ్డుకోవడం తగదని, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. అయితే యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన వెంటనే పాలికె బడ్జెట్‌ను నిలిపివేశారని, దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఎందుకు పాలికె బడ్జెట్‌ను అడ్డుకుందని అంగీకరిస్తుందా లేదా అని సభలో పట్టుబట్టారు. దీనికి విపక్షనేత పద్మనాభరెడ్డి సమాధానమిస్తూ మీరు రూ.13 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారని, అయితే రూ.9 వేల కోట్లకు మాత్రమే ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందన్నారు. కానీ బెంగళూరు నగరాబివృద్ది శాఖ మంత్రి ఆర్దిక శాఖ ఆమోదించిన రూ.9 వేల కోట్లు నిధులను రూ.12,950 కోట్లకు పెంచిన నేపథ్యంలో అడ్డుకున్నారని తెలిపారు. నిధులు పెంచే అధికారం నగరాభివృద్ధి శాఖకు లేదని దీంతో ముఖ్యమంత్రి బడ్జెట్‌ను అడ్డుకున్నారని చెప్పడంతో కాంగ్రెస్ కార్పోరేటర్ శివరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పై నమ్మకంతో బెంగళూరులో నలుగురు ఎంపీలను ప్రజలు ఎన్నుకున్నారని గుర్తు చేయగా ఈ క్రమంలో శివరాజ్, పద్మనాభరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. శివరాజ్‌కు కాంగ్రెస్ కార్పోరేటర్లు మద్దతుగా నిలువగా పద్మనాభరెడ్డికి బీజేపీ కార్పోరేటర్లు మద్దతుగా నిలిచారు. దీంతో కొద్దిసేపు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కమిషనర్ మంజునాథ్‌ప్రసాద్ సభను అదుపులోకి తీసుకువచ్చి పద్మనాభరెడ్డి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాలతో బడ్జెట్‌ను నిలుపుదల చేశారని నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని పద్మనాభరెడ్డి సభకు సమాధానమిచ్చారు. -
జీవితంపై విరక్తి చెందాం
బెంగళూరు : భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. వీరు ఇక్క డి శ్రీనగర కాళప్పలేఔట్ కేంబ్రిడ్జ్ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. సిద్దయ్య కేఈబీ లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. రాజేశ్వరి గృహిణి కాగా కుమార్తెలు మానస ప్రథమ పీయూసీ చదువుతుండగా, భూమిక ఎస్ఎస్ఎల్సీ చదువుతోంది. సిద్దయ్య మూడేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుడంటంతో భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పలుమార్లు కుటుంబ పెద్దలతో రాజీ చేసి సిద్దయ్య ప్రవర్తన మార్పురాలేదు. ఇటీవల సిద్ధయ్య ఇంటికి రావడం కూడా తగ్గించడంతో భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. విధుల నిమిత్తం సిద్దయ్య వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆదివారం రాత్రి రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు స్థానికులు సాయంతో తలుపు బద్దలుకొట్టి గదిలో చూడగా ముగ్గురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రాజేశ్వరి తన వాట్సాప్ చివరి స్టేటస్‌లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డామని తన చావుకు సిద్దయ్య, అతని ప్రియురాలే కారణమని తెలిపింది. వాట్సాప్ చివరి స్టేటస్ -
ప్రకాశ్‌రాజ్ నామినేషన్ తిరస్కరించండి
కృష్ణరాజపురం : బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని బీజేపీ నేత గిరీశ్‌కుమార్ నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. కర్ణాటకతో పాటు తమిళనాడులో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చొప్పున ఎన్నికల గుర్తింపు కార్డులు కలిగిఉన్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల గుర్తింపు కార్డులో ప్రకాశ్‌రాజ్ సన్నాఫ్ మంజునాథ రై అని ఉందని ఫిర్యాదులో గిరీశ్‌కుమార్ పేర్కొన్నాడు. -
యువ సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి
పొదలకూరు (నెల్లూరు): బెంగళూరులో జరిగిన రైలు ప్రమాదంలో మండలంలోని నల్లపాళెంకు చెందిన యువ సాప్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు వివరాలు.. ఆరునెలల క్రితం పార్లపల్లి సుబ్బారెడ్డి (27) బెంగళూరులోని సాప్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఈనెల 1వ తేదీ నుంచి అతను కనిపించడం లేదని కుటుంబసభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. అప్పటినుంచి వారు బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి విచారించడంతో సుబ్బారెడ్డి రైలు ప్రమాదంలో మృతిచెందినట్టు తెలిసింది. వెంటనే బంధువులు, స్నేహితులు మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఒక్కడే కుమారుడు నల్లపాళెంకు చెందిన పార్లపల్లి శేషారెడ్డికి సుబ్బారెడ్డి ఒక్కడే కుమారుడు. గతంలో అతను కేరళలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. తర్వాత ఇంటికి వచ్చేసి మళ్లీ ఆరునెలల క్రితం బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. ఉదయం కంపెనీకు వెళ్లే క్రమంలో లోకల్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయి సుబ్బారెడ్డి మృతిచెందాడు. అయితే రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించినా సరైన వివరాలు లభ్యం కాక వీలుపడలేదు. దీంతో వారు పోస్ట్‌మార్టం నిర్వహించి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. సుమారు వారంరోజులుగా సుబ్బారెడ్డి కనిపించకపోవడంతో స్నేహితులు, కుటుంబసభ్యులు హైరానపడి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా అనుమానించారు. చివరకు అతను మృతిచెందాడని తెలుసుకుని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సుబ్బారెడ్డికి తల్లిలేదు. తండ్రి పెంచాడు. అవివాహితుడైన కుమారుడి మరణవార్త తెలుసుకుని శేషారెడ్డి బోరున విలపిస్తున్నారు. -
ఉద్యోగం తెచ్చుకుందిగానీ...ఊపిరి పోగొట్టుకుంది
బత్తలపల్లి : బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లిన యువతి ఉద్యోగం సాధించిందిగానీ... అక్కడ తిరిగి తిరిగి వడదెబ్బ తగలడంతో ఇంటికొచ్చిన తర్వాత అస్వస్థతకు లోనై మృతి చెందింది. ఈ దుర్ఘటన బత్తలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... మండలంలోని పోట్లమర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి 20 సంవత్సరాలుగా మండల కేంద్రమైన బత్తలపల్లిలో నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. చిన్న కుమార్తె శ్రీలక్ష్మీ(26) బీటెక్ పూర్తి చేసింది. మూడు రోజుల క్రితం బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వూలకు హాజరైంది. ఉద్యోగానికి ఎంపికైంది. బుధవారం బెంగుళూరు నుంచి బత్తలపల్లికి చేరుకుంది. ఇంటికి రాగానే ఉన్నఫళంగా కింద పడిపోయింది. తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా బుధవారం రాత్రి మార్గమధ్యంలోనే శ్రీలక్ష్మీ చెందింది. కొడుకులు లేకున్నా కూతుర్లనే కొడుకులుగా భావించి ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం వచ్చాక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయావా తల్లీ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. -
బెంగళూరులో సుండుపల్లి వాసి మృతి
సుండుపల్లి: మండలంలోని పీఎన్ కాలువ గ్రామపంచాయతీకి చెందిన సాధు వెంకటరామిరెడ్డి కుమారుడు సాధు భరత్‌కుమార్‌రెడ్డి (28) బెంగళూరులో రైలు ఢీకొని మృతి చెందాడు. భరత్‌కుమార్‌రెడ్డి జీవనోపాధి కోసం బెంగళూరులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైన్‌హాలీ రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి వెంకటరామిరెడ్డి పేరుమీద ఉన్న డెబిట్‌కార్డు ఆధారంగా బెంగళూరు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. వీరి ద్వారా విషయం తెలుసుకున్న భరత్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.