
వడదెబ్బతో మృతి చెందిన శ్రీలక్ష్మీ
బత్తలపల్లి : బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లిన యువతి ఉద్యోగం సాధించిందిగానీ... అక్కడ తిరిగి తిరిగి వడదెబ్బ తగలడంతో ఇంటికొచ్చిన తర్వాత అస్వస్థతకు లోనై మృతి చెందింది. ఈ దుర్ఘటన బత్తలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... మండలంలోని పోట్లమర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి 20 సంవత్సరాలుగా మండల కేంద్రమైన బత్తలపల్లిలో నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. చిన్న కుమార్తె శ్రీలక్ష్మీ(26) బీటెక్ పూర్తి చేసింది. మూడు రోజుల క్రితం బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వూలకు హాజరైంది. ఉద్యోగానికి ఎంపికైంది. బుధవారం బెంగుళూరు నుంచి బత్తలపల్లికి చేరుకుంది.
ఇంటికి రాగానే ఉన్నఫళంగా కింద పడిపోయింది. తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా బుధవారం రాత్రి మార్గమధ్యంలోనే శ్రీలక్ష్మీ చెందింది. కొడుకులు లేకున్నా కూతుర్లనే కొడుకులుగా భావించి ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం వచ్చాక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయావా తల్లీ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment