అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మద్యం వ్యసనం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దొంగను చేసింది. డబ్బు కోసం పక్కింటి ఒంటరి మహిళ నగలపై కన్నేశాడు. అదను చూసి నగలు చోరీ చేశాడు. అనుమానం రాకుండా అత్యంత జాగ్రత్తపడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పది రోజుల్లోపే కేసు ఛేదించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగే దొంగ అని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. తాగుడుకు అవసరమైన డబ్బు కోసమే ఈ చోరీ చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో రమాదేవి అనే ఒంటరి మహిళ నివాసం ఉంటోంది. ఆమె అద్దెకుంటున్న చిన్నపాటి భవనంలోనే నాలుగు పోర్షన్లు ఉన్నాయి. రమాదేవి ఇంటి పక్కనే మరో కుటుంబం నివాసం ఉంటోంది. వారి ఇంటికి ఇటుకలపల్లికి చెందిన సందీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వచ్చి వెళుతుండేవాడు. వర్క్ ఫ్రం హోం కావడంతో ఎక్కువ శాతం అతనూ ఇక్కడే గడిపేవాడు. ఇందులో భాగంగానే రమాదేవి దగ్గర బంగారు నగలు ఉన్న విషయాన్ని సందీప్ గమనించాడు. ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు.
వేసవి కావడంతో అన్ని కుటుంబాల వారూ రాత్రిపూట మేడపై పడుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని చోరీకి పథక రచన చేశాడు. ఈ నెల 14న రాత్రి అక్కడే బస చేశారు. అర్ధరాత్రి వేళ రమాదేవి తల దిండుకింద ఉంచిన తాళం చెవి తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బీరువా తెరచి 25 తులాల బంగారు ఆభరణాల్లో 7 తులాల నగలను అపహరించాడు. తిరిగి తాళం చెవిని రమాదేవి దిండు కింద పెట్టి.. అక్కడి నుంచి జారుకున్నాడు. 15న ఉదయం ఇంట్లోకి వెళ్లిన రమాదేవి.. అప్పటికే తెరిచి ఉన్న బీరువాని గమనించింది. బంగారు నగలను పరిశీలిస్తే కొన్ని కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది.
బుకాయించినా.. బుక్కయ్యాడు..
పోలీసులు మొదట చోరీ జరగలేదని భావించారు. అయితే రమాదేవి పక్కాగా చెబుతుండటంతో నేరస్థలాన్ని పరిశీలించిన పోలీసులు తగిన ఆధారాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఆ ఇంటి చుట్టుపక్కల నివాసముంటున్న వారి వేలి ముద్రలను తీసుకున్నారు. అయితే వీరి వేలిముద్రలు సరిపోలలేదు. చివరగా సందీప్ ఒక్కడే మిగిలిపోయాడు.
పోలీసులు పిలిస్తే తనకు ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌లో కోట్ల రూపాయల స్థలానికి చెందిన పంచాయితీ నడుస్తోందని, తానిప్పుడు రాలేనని బుకాయిస్తూ వచ్చాడు. రెండు రోజులు ఎదురు చూసిన పోలీసులు ఎట్టకేలకు సందీప్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. అయినా అతని నుంచి సరైన వివరాలు రాలేదు. చివరగా వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో చేసేదిలేక సందీప్ నగలు చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. కాజేసిన బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును తాగుడు కోసం ఖర్చు చేసినట్లు చెప్పాడు. నిందితుడు సందీప్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment