చెల్లి సంతోషం కోసమే బావ హత్య | Software engineer kills wife,Brother in law in Hyderabad | Sakshi
Sakshi News home page

చెల్లి సంతోషం కోసమే బావ హత్య

Published Thu, Dec 12 2013 12:20 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

చెల్లి సంతోషం కోసమే బావ హత్య - Sakshi

చెల్లి సంతోషం కోసమే బావ హత్య

 సాక్షి, సిటీబ్యూరో: ‘బీటెక్ చదివాడంటే కట్నకానుకలతో మా చెల్లిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాం. ఆరు నెలలకే అన్నతో కలిసి వేధింపులు మొదలెట్టాడు.  విడాకుల అంశం కోర్టులో ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. తరచు నా చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తూ అతడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. అందుకే చెల్లి సంతోషం కోసం ఇలా చేశా’
 
 - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌ను
 సుపారీ హత్య చేయించిన అరుణ్‌కుమార్
 మీడియాతో చెప్పిన మాటలివి.
 
 నాడు బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లల్లో ఆనందం కోసం పరిటాల రవిని కాల్చానని మొద్దు శీను చెప్పగా... నేడు చెల్లెలి సంతోషం కోసం బావను హత్య చేయించానంటూ అరుణ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. ఎస్సార్ నగర్ ఠాణాలో మిస్సింగ్‌గా నమోదై... హత్యగా మారిన ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అదనపు డీసీపీ కె.నాగరాజు, పంజగుట్ట ఏసీపీ డి.వెంకట నర్సయ్యలతో కలిసి ఆయన తన కార్యాలయంలో విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. అధికారులు, నిందితుడు అరుణ్‌కుమార్ కథనం ప్రకారం...
 
 పెళ్లైన ఆరు నెలలకే వేధింపులు...
 ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న అరుణ్‌కుమార్ గౌడ్ గతంలో నగరంలోనే ఉన్నాడు. బీకే గూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌గౌడ్ బీటెక్ చదివాడని అతడి కుటుంబీకులు చెప్పడంతో తన సోదరి సంధ్యను ఇచ్చి 2006 జూలై 31న పెళ్లి చేశాడు. పెళ్లైన ఆరు నెలలకే భర్తతో పాటు అతడి సోదరుడు విజయ్‌బాబుగౌడ్ నుంచి సంధ్యకు కట్నం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో చెన్నైలోని సీ-2 పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ పరిణామాలతో ఇద్దరూ విడాకుల కోసం చెన్నైతో పాటు నగరంలోని కోర్టులోనూ దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్న సందర్భంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్‌గౌడ్ కట్నకానుకల్ని తిరిగి ఇవ్వడంతో పాటు బాలానగర్‌లోని ఫ్లాట్‌ను ఇవ్వాల్సి ఉండగా... అరుణ్ ఎన్నిసార్లు కోరినా తూలనాడాడు.  మరోపక్క ఏడాదిన్నర క్రితం చంద్రశేఖర్ తరఫువారు చెన్నైలోని సంధ్య ఇంటికి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఆమె కోర్టు వాయిదాల కోసం నగరానికి వచ్చిన ప్రతీసారి  విజయ్‌బాబు మనుషులు వేధించడంతో పాటు బెదిరించారు.
 
 స్నేహితులతో చర్చించి పథకం...
 ఓ పక్క తన చెల్లి కాపురం చెడిపోగా,  బావ మరో యువతిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటాన్ని అరుణ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని నగరానికి చెందిన తన స్నేహితుడు మహ్మద్ యూనుస్ పాషాకు చెప్పాడు. అతడిని రెండుమూడుసార్లు కలిసి చర్చించుకున్న తరవాతే చంద్రశేఖర్‌ను మట్టుపెట్టించాలని అరుణ్ నిర్ణయించుకున్నాడు.  నేరుగా తానే నేరం చేస్తే పోలీసులకు చిక్కిపోవచ్చని ఆ బాధ్యతల్ని పాషాకే అప్పగించి ‘పని’ పూర్తయ్యాక రూ.6.5 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. చంపిన తరవాత ఆ ఫొటోలను తనకు మెయిల్ చేయాలని షరతుపెట్టాడు. పాషా తన స్నేహితులైన మధు, శివలతో కలిసి రంగంలోకి దిగి.. చంద్రశేఖర్ కదలికలు, వ్యవహారశైలిని పూర్తిగా అధ్యయనం చేశాడు.
 
 ఇంటి నుంచే కిడ్నాప్ చేసి..
 చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పలు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇతడి రెండో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం పసిగట్టిన ముగ్గురు ముష్కరులు 4వ తేదీ తెల్లవారుజామున 4.30కి కారులో అతడి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి శబ్ధం చేయకుండా ఇంట్లోకి ప్రవేశించి.. నిద్రలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్‌కు మత్తు ఇచ్చారు. స్పృహకోల్పోయిన అతడిని కారులో కిడ్నాప్ చేసుకెళ్లి.. కారులోనే హత్య చేసి వికారాబాద్ శివార్లలో పడేశారు. కారులోనే తీసిన మృతదేహం ఫొటోలను అదే రోజు ఉదయం 10.15 గంటలకు పాషా తన మెయిల్ ఐడీ నుంచి అరుణ్‌కు చెందిన ఐడీకి పంపాడు.  ఈ మెయిల్‌లో ‘ఐ హ్యావ్ ఎటాచ్డ్ బాస్టర్డ్ డెడ్ ఫొటోస్ జస్ట్ సీ ధెమ్’ అని రాస్తూ... సుపారీ మొత్తాన్ని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచేశాడు. ఈ మొత్తంలో రూ.5 లక్షలు తన ఖాతాలో వేయమని, మిగిలింది తన క్లినిక్‌లో అప్పగించమని రాశాడు.
 
 తండ్రికి కానుకగా బావ చావు...
 సంధ్య ఉదంతంతో అరుణ్‌కుమార్ కుటుంబం మొత్తం తీవ్ర మనస్తాపానికి గురైంది. ముఖ్యంగా అతడి తండ్రి బాగా డీలా పడిపోయాడు. మంగళవారం ఆయన పుట్టిన రోజు కావడంతో ఆ కానుకగా తన బావ చావు వార్త, ఫొటోలను అందించాలని అరుణ్ భావించాడు. ఈ నేపథ్యంలోనే పాషా నుంచి తనకు వచ్చిన ఫొటోలను సంధ్యతో పాటు మరో సోదరుడికీ మెయిల్ ద్వారా పంపిస్తూ... ‘ఐ హ్యావ్ అటాచ్డ్ బాస్టర్డ్ డెత్ ఫొటోస్. దట్ ఈజ్ గిఫ్ట్ టు మై డాడ్ ఆన్ హిజ్ బర్త్ డే’ అని రాశాడు. ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి ఎక్కడంతో పోలీసుల సాంకేతిక దర్యాప్తు ప్రారంభమై అరుణ్, పాషా, మధు కటకటాల్లోకి చేరారు. పరారీలో ఉన్న శివ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలో సంధ్య పాత్ర ఉన్నట్లు తేలితే ఆమె పైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement