అటు జలకళ..ఇటు విలవిల | Somasila Reservoir Filled With Flood Water | Sakshi
Sakshi News home page

అటు జలకళ..ఇటు విలవిల

Published Thu, Oct 31 2019 1:22 PM | Last Updated on Thu, Oct 31 2019 1:22 PM

Somasila Reservoir Filled With Flood Water - Sakshi

నిండుకుండలా సోమశిల జలాశయం

అట్లూరు: సోమశిల రిజర్వాయర్‌ పూర్తి జలకళతో ఉట్టిపడుతోంది. బుధవారం సాయంత్రానికి దీని నీటిమట్టం 78 టీఎంసీలకు చేరుకుంది. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టమిది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆనందం వ్యక్తమవుతుంటే మన జిల్లాలో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కారణం ఈ రిజర్వాయరును నెల్లూరు జిల్లా సోమశిల దగ్గర నిర్మించినా దీని వెనుక జలాలతో మన జిల్లాలోని కొన్ని మండలాలకు ముంపునకు గురవుతున్నాయి. తాజాగా రిజర్వాయరు నిండిపోవడంతో అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు, గోపవరం మండలాలలోని వందకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంట పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి.

ముంపు బాధితులను ఆదుకుంటాం:ఆర్‌డీఓ ధర్మచంద్రారెడ్డి
ఒంటిమిట్ట: సోమశిల ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటాంమని ఆర్‌డీఓ ధర్మచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం పెన్నపేరూరు, గంగపేరూరు, తప్పెటవారిపల్లె, వెంకటాయపల్లె, ఇబ్రహీంపేట, చిన్నకొత్తపల్లె గ్రామాలను ఆయన పరిశీలించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయికి చేరడంతో తప్పెటవారిపల్లె, పెన్నపేరూరులలో ఇళ్లలోకి నీరు  చేరింది. అక్కడి ప్రజలు చాలా యాతన పడుతున్నారు. నరసన్నగారిపల్లెలో 40 ఎకరాల్లో వెనుక జలాలు వచ్చాయని బాధిత రైతులు తహసీల్దార్‌ విజయకుమారి దృష్టికి తీసుకొచ్చారు.  ఆమె వెళ్లి ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ సోమశిల ఇరిగేషన్‌ ఇంజనీర్ల అభ్యర్థన మేరకు గురువారం సోమశిల స్పెషల్‌ కలెక్టరు పరిశీలించనున్నారన్నారు. పరిహారం అందని భూముల్లో పంటలకు, పంట వేసిన భూములకు పరిహారం అందిస్తామన్నారు. పరిహారం తీసుకున్న ముంపు భూముల్లో  దెబ్బతిన్న పంటలకు మానవత్వదృక్పథంతో నష్టపరిహారం చెల్లించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. బాధితులకు రేషన్‌ సహాయం అందిస్తామన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి,  మేకపాటి నందకిషోర్‌రెడ్డి, ముమ్మడి నారాయణరెడ్డిలతోపాటు అధికారులు పాల్గొన్నారు.

పరిహారానికి నోచుకోని  పలుగ్రామాలు
సోమశిల జలాశయం ముంపు జలాలతో (బ్యాక్‌వాటర్‌) బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు బాధ ఓపక్క వీరిని వెంటాడుతుంటే కనీసం పరిహారం చెల్లించలేదని ఆగ్రహం చెందుతున్నారు. పరిహారం చెల్లింపు విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదు. కనీస చర్యలు కూడా తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. భూములు, ఇళ్లకు నష్టపరిహారం  కొంతమేర చెల్లించినప్పటికీ అట్లూరు మండలంలోని ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లి, వరికుంట ఎస్సీ కాలనీ, రంగంపల్లి, గొల్లపల్లి గ్రామాలకు ఇంతవరకూ నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. బుధవారం సాయంత్రం ఈ మండల గ్రామాలను బ్యాక్‌వాటర్‌ చుట్టుముట్టింది. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామాలను ముంచారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వచ్చి తమ గ్రామాలను పరిశీలించి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముంపు బాధిత గ్రామాలైన ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లిలను మంగళవారంఎమ్మెల్యే డాక్టరు వెంకటసుబ్బయ్య పరిశీలించారు. తమ ప్రభుత్వం ఆయా గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement