గద్వాల/ధరూరు, న్యూస్‌లైన్: కరువు జిల్లాలో ఏకైక భారీ ప్రాజెక్టు వద్ద నిర్మితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రానికి పునాదిరాయి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా అడ్డంకులు, సాంకేతిక లోపాలు, వరద గండం ఇలా ఒకటి తీరిందంటే మరొకటి అడ్డు తగులుతున్నాయి. దీంతో 2008 నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంతో నిర్మితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రం వద్ద 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఆరు బల్బుటైప్ చైనా టర్బైన్లను ఏర్పాటు చేశారు.
2008 అక్టోబర్ 5న రెండు టర్బైన్లతో జాతికి అంకితమైన జూరాల జలవిద్యుత్ కేంద్రంలో నాటినుంచి అన్ని సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు 1996లో జాతికిఅంకితం కాగా, సివిల్ బ్లాకులు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2002 వరకు జూరాల జలవిద్యుత్ కేంద్రానికి మంజూరు లభించలేదు. పీఎఫ్‌సీ నుంచి రుణం లభించడంతో 2004 డిసెంబర్‌లో జలవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించారు. నాలుగేళ్ల అనంతరం రెండు టర్బైన్లను 2008లో సిద్ధం చేశారు.
ఈ టర్బైన్లను జాతికి అంకితం చేసిన ఏడాది కూడా విద్యుదుత్పత్తి చేయకుండానే సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. ప్రతి నాలుగు నెలలకు మరొక టర్బైన్‌ను సిద్ధం చేస్తామన్న చైనా కంపెనీ, సాంకేతిక లోపం తలెత్తిన 1,2వ టర్బైన్లను పూర్తి చేసేందుకు రెండేళ్లకాలం పట్టింది. మిగతా నాలుగు టర్బైన్లను ఎలాగోలా పూర్తి చేస్తూ 2012 చివరి నాటికి ఆరు టర్బైన్లను సిద్ధంచేశారు. ఈ ఏడాది వరద ప్రవాహం లేకపోవడంతో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి చేయలేకపోయారు. 2009లో కృష్ణానదికి వరదలు పూర్తిస్థాయిలో రావడంతో జలవిద్యుత్ కేంద్రంలో టర్బైన్లు పనిచేయకుండా ఎదురు వరద గండం ఏర్పడింది.
ఇలా నదిలో వరద పెరిగితే విద్యుదుత్పత్తి తగ్గిపోవడం మరో అడ్డంకిగా మారింది. ఆరు టర్బైన్లు సిద్ధంకావడం ఈ ఏడాది ఖరీఫ్‌కు నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండి జూరాలకు జూలై 21న వరద వచ్చి చేరింది. ఆరు టర్బైన్లను ప్రారంభించి జలవిద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇంతలోనూ నదికి లక్షన్నర క్యూసెక్కుల వరద పెరగడంతో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి కాకుండా 200 మెగావాట్లకు మించలేదు.
జెన్‌కోకు భారీ నష్టం... 2008లో ప్రారంభమైన జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ప్రతి నాలుగు నెలలకు ఒక టర్బైన్ చొప్పున 2009 చివరి నాటికి ఆరు టర్బైన్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేసి ఉంటే జెన్‌కోకు విద్యుత్ ద్వారా మేలు జరిగేది. అలా కాకుండా సాంకేతిక సమస్యలతో ప్రారంభించిన యూనిట్లే మళ్లీ నిలిచిపోవడం, వాటిని బాగు చేయడం ఇలా ఐదేళ్ల కాలం పట్టింది. ఇంత జరిగినా ఈ ఏడాది అయినా పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగి జెన్‌కోకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనుకున్న తరుణంలో మళ్లీ సాంకేతిక సమస్యలతో నాలుగు యూనిట్లు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆశించిన ఆశలన్నీ అడియాసలయ్యాయి. జూరాల జలవిద్యుత్ కారణంగా ఆశించిన దానికన్నా జెన్‌కోకు భారీ నష్టమే మిగిలింది.
తీరని నష్టం
Published Wed, Aug 28 2013 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement