కదులుతున్న డొంక | Some of the teachers on fake certificates Promotions | Sakshi
Sakshi News home page

కదులుతున్న డొంక

Published Fri, Oct 17 2014 3:07 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

Some of the teachers on fake certificates Promotions

* నకిలీ సర్టిఫికెట్లపై  సీబీసీఐడీ  విచారణ  
* ఇద్దరు టీచర్లు, అధికారుల నుంచి వివరాల సేకరణ

కడప ఎడ్యుకేషన్: నకిలీ సర్టిఫికెట్లపైన కొందరు ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారనే విషయంపై డొంక కదులుతోంది. గురువారం తిరుపతికి చెందిన సీబీసీఐడీ అధికారులు  డీఈఓ కార్యాలయం లో విచారణ  చేపట్టారు. ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులతోపాటు అప్పట్లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను సైతం విచారించారు. 2009లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా  చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారనే అరోపణలపై  దుమారం చెలరేగింది.   

అప్పట్లో పాఠశాల విద్యా కమిషనర్ విచారణకు అదేశిస్తూ డీఈఓ కార్యాలయ ఏడీలతో రాష్ట్రవ్యాప్తంగా కేసులను నమోదు చేయించారు.  దీంతో  సర్టిఫికెట్లను పరి శీలించాలని ఆదేశిస్తూ సంబంధింత కేసును సీబీసీఐడీకి  అప్పగించారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ జి. కళావతి  సిబ్బందితో గురువారం  డీఈఓ కార్యాలయంలో విచారణ  చేపట్టారు.  ఇందులో కదులుతున్న డొంక భాగంగా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్  పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేంపల్లి మండలం తాళ్లపల్లె  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రకాషరాజ్(ఇంగ్లీష్)ను,  అలాగే చాపాడు మండలం నక్కలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మునెయ్య (సోషియల్)తో పాటు అప్పట్లో  వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను( ఎంఈఓలు, హెచ్‌ఎంలు) సైతం  విచారించారు.  సర్టిఫికెట్లను  ఏ యూనివర్శిటీ నుంచి తెచ్చుకున్నారనే విషయాలపై కూలంకషంగా విచారణ చేశారు.
 నివేదిక  సమర్పిస్తాః సీబీసీఐడీ సీఐ
                                           
2009లో నకిలీ సర్టిఫికెట్లతో ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారనే విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణకు కడపకు  వ చ్చినట్లు  సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ జి. కళావతి పేర్కొన్నారు. అప్పట్లో కడప జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.  సంబంధిత ఇద్దరు టీచర్లను పిలిపించామన్నారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు  అందజేస్తామన్నారు. వారికి సర్టిఫికెట్లను జారీ చేసిన యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాలను కూడా విచారిస్తామన్నారు.

వీరిలో  ఒకరేమో సేలంలోని వినాయక మిషన్ యూనివర్సీటీ  నుంచి సర్టిపికెట్ తేగా మరొకరు రాజస్తాన్‌లోని జేఆర్‌ఎం యూనివర్శిటీ  నుంచి  తెచ్చారన్నారు. వీరు సర్టిఫికెట్లు తెచ్చేనాటికి వాటికి యూజీసీ గుర్తింపు ఉన్నదా లేదా అనేది కూడా విచారిస్తామన్నారు. సంబంధిత సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు వారి సర్టిఫికేట్లను పరిశీలించిన  వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.  విచారణలో  సిబ్బంది గోపీనాధ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శివ తదితరులు కూడా  పాల్గొన్నారు.
 
నకిలీ సర్టిఫికెట్లు కావు: తమ ప్రమోషన్ల సమయంలో చూపిన సర్టిఫికెట్లు నకిలీవి కావని ఉపాధ్యాయులు మునెయ్య, ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అప్పట్లో విద్యాశాఖాధికారులు  కూడా పరిశీలించారన్నారు.  తాము  సర్టిఫికెట్లు పొందిన యూనివర్సిటీలు  గుర్తింపు ఉన్నవేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement