సాక్షి, గుంటూరు : ‘సందర్భం ఏదైనా కావచ్చు. మీరు చెప్పిన పని తప్పకుండా పాటిస్తాం’ అంటూ టీడీపీ నేతలు చెప్పినట్లుగా పనిచేయడంలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది వెనుకాడటం లేదు. ఎలాంటి సమాచారం కావాలన్నా ఇట్టే చేరవేస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. చివరకు రహస్యంగా ఉంచాల్సిన ఫొటోలు, వివరాలను సైతం చేరవేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీన టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు చలో ఆత్మకూరుకు పిలుపిచ్చారు. అయితే పోలీసుల ఆంక్షలు అమల్లో ఉండటంతో ఆయా పార్టీల నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడి కక్కడ గృహ నిర్బంధం చేశారు. రహస్యంగా వెళ్లాలని యత్నించిన వారిని సైతం గుర్తించి వారిని వెనక్కి పంపారు. ఇదంతా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా పోలీసులు, స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ నెలకొంటున్న విషయాలను ఫొటోలు తీశారు. తీసిన ఫొటోలను సంబంధిత అధికారులకు చేరవేశారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ తీసిన ఫొటోలను సైతం ఇచ్చేశారు. శాఖ పరంగా ఇది సర్వసాధారణం. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి, ఓ కానిస్టేబుల్ ఇద్దరూ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరుగుతున్న పరిస్థితులు, సమాచారాన్ని వాట్సాప్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలకు చేరవేశారు. ‘ఓకే సార్.. ఫోటోలు కూడా పంపుతాం’ అంటూ తమ వద్దకు చేరిన వందల ఫొటోలను సైతం టీడీపీ నేతలకు చేరవేశారని పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment