అల్లుడే కాలయముడు
Published Fri, Mar 3 2017 5:47 PM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM
► అవమానించారనే వృద్ధ దంపతుల హత్య
► అత్యాచారంగా చిత్రీకరణ
► విలేకరుల సమావేశంలో డీఎస్సీ నంజుండప్ప వెల్లడి
రేణిగుంట: మండలంలోని ఆర్.మల్లవరం పంపుసెట్ షెడ్డులో గతనెల 26వ తేదీన నిద్రిస్తున్న వృద్ధ దంపతులను అల్లుడు వెంకటేష్(30) హతమార్చినట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆయన గురువారం రేణిగుంట పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుత్తివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కొత్తకోట శ్రీనివాసులు(60), అతని భార్య ఇందిరమ్మ అలియాస్ ఇంద్రాణమ్మ(55) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ క్రమంలో కొడుకులకు ఆసరాగా ఉండేందుకు ఆర్.మల్లవరం సమీపంలోని పంపు సెట్ వద్ద కాపలా ఉండేవారు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన వారు హత్యకు గురయ్యారు. ఈ కేసును అర్బన్ సీఐ బాలయ్య నేతృత్వంలో ఎస్‌ఐలు శ్రీనివాసులు, మధుసూదన్‌రావు, సిబ్బంది శేఖర్, వరప్రసాద్, మధు, రమణరాజు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
మృతుల అల్లుడు వెంకటేష్‌పై అనుమానంతో బుధవారం సాయంత్రం కరకంబాడి ఆటో స్టాండు వద్ద ఉన్న అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను హత్యకు దారితీసిన కారణాలను వెల్లడించాడు.నిందితుడు వెంకటేష్ గుత్తివారిపల్లి ఎస్టీ కాలనీలో అత్తమామల ఇంటి సమీపంలోనే కాపురముండే వాడు. అతనికి అత్త ఇందిరమ్మపై కామవాంఛ కలిగింది. ఈ విషయం ఆమెకు చెప్పాడు. ఆమె అల్లరిచేసి అల్లుడిని అందరి ముందు అవమానపరిచింది. దీంతో ఎలాగైనా అత్తామామలను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న రాత్రి గుత్తివారిపల్లి కాలనీ నుంచి అత్తమామలిద్దరూ పంపు షెడ్డుకు రావడాన్ని గమనించాడు.
అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న షెడ్డు వద్దకు చేరుకున్నాడు. తలుపునకు గడియ పెట్టకపోవడంతో ఇంట్లోకి వెళ్లి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో తొలుత శ్రీనివాసులు తలపై మోది చంపేశాడు. తర్వాత విషయం బయటపెడుతుందని అత్త ఇందిరమ్మను ఇనుపరాడ్, గుండ్రాయి సాయంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అత్యాచారంగా చిత్రీకరించేందుకు ఇంది రమ్మ ఒంటిపై దుస్తులను తొలగించి కాళ్లను తాళ్లతో కట్టేసి పారిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. జంట హత్యల కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ బాలయ్య, సిబ్బందిని ఆయన అభినందించారు.
Advertisement
Advertisement