స్వాధీనం చేసుకున్న వస్తువులు
లిఫ్ట్ ఇవ్వాలని రాత్రి పూట రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి వాహనాన్ని ఆపితే లారీ డ్రైవర్లు ఏం చేస్తారు? వారెవ్వా! ఏం బ్యూటీ అని ఎగిరి గంతేసి ఆపితే..! వాళ్ల ఆశలకు బ్రేకులేసి ఉన్నదంతా ఊడ్చేశారు. ఒక బ్యూటీ+ముగ్గురు ఖతర్నాక్‌లు కలిసి లూటీలకు వేసిన ప్లాన్ ఇది. తీరా చూస్తే ఆ బ్యూటీ కూడా ఆడవేషం ధరించిన ఓ ఖతర్నాక్‌గాడే..పోలీసులు ఎట్టకేలకు ఈ ముఠా భరతం పట్టారు.
సాక్షి, రేణిగుంట : జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను టార్చ్‌లైట్ వేసి ఆపి వారి నుంచి బలవంతంగా డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కుని దారిదోపిడీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రేణిగుంట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు డీఎస్పీ తెలిపిన వివరాలు.. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వెంకటరమణ, శ్రీరామ్, వెంకటాద్రి, సైదాపురం మండలానికి చెందిన శరత్‌కుమార్ కొంత కాలంగా రేణిగుంట, వడమాలపేట, కరకంబాడి, రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలలో రాత్రిపూట హైవేలలో దారిదోపిడీకి పాల్పడుతున్నారు.
వీరిలో శ్రీరామ్‌కు అందమైన యువతిలా వేషం వేసి హైవేపై టార్చ్‌లైటుతో లారీలను ఆపేవారు. ఎవరో అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతోందని భావించి లారీడ్రైవర్ ఆపగానే హఠాత్తుగా తక్కిన ముగ్గురూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని దాడి చేసేవారు. లారీడ్రైవర్ల నుంచి నగదు, సెల్‌ఫోన్లను దోచుకునేవారు. ఈనెల 16న కాట్పాడి నుంచి రైలులో వస్తున్న మహేష్ అనే యువకుడితో వీరు నలుగురూ పరిచయం పెంచుకుని అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు.
రేణిగుంట పోలీస్‌స్టేషన్‌లో దారిదోపిడీ ముఠా అరెస్ట్ చూపుతున్న డీఎస్పీ చంద్రశేఖర్
రేణిగుంట రైల్వేస్టేషన్‌లో అందరూ దిగారు. అక్కడ నుంచి మామండూరు అటవీప్రాంతంలోకి మహేష్‌ను తీసుకెళ్లి కొట్టి, అతని వద్దనున్న రూ.1600తోపాటు సెల్‌ఫోన్, సర్టిఫికెట్లను లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ అంజూయాదవ్ విచారణ చేశారు. శుక్రవారం రేణిగుంట చెక్‌పోస్ట్ రమణ విలాస్ సర్కిల్ వద్దనున్న ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో వీరు హైవేలపై దారిదోపిడీలకు పాల్పడమే కాకుండా విశాఖ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి రేణిగుంట పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి 800గ్రాముల గంజాయి, రూ.460 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక చీర, జాకెట్, టార్చిలైటు, జడ(విగ్)ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రిమాండ్‌కు తరలించారు. దారిదోపిడీ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, సిబ్బందిని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment