Renigunta National Highway
-
ఒక బ్యూటీ.. ముగ్గురు ఖతర్నాక్‌లు..
లిఫ్ట్ ఇవ్వాలని రాత్రి పూట రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి వాహనాన్ని ఆపితే లారీ డ్రైవర్లు ఏం చేస్తారు? వారెవ్వా! ఏం బ్యూటీ అని ఎగిరి గంతేసి ఆపితే..! వాళ్ల ఆశలకు బ్రేకులేసి ఉన్నదంతా ఊడ్చేశారు. ఒక బ్యూటీ+ముగ్గురు ఖతర్నాక్‌లు కలిసి లూటీలకు వేసిన ప్లాన్ ఇది. తీరా చూస్తే ఆ బ్యూటీ కూడా ఆడవేషం ధరించిన ఓ ఖతర్నాక్గాడే..పోలీసులు ఎట్టకేలకు ఈ ముఠా భరతం పట్టారు. సాక్షి, రేణిగుంట : జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను టార్చ్‌లైట్ వేసి ఆపి వారి నుంచి బలవంతంగా డబ్బులు, సెల్ఫోన్లు లాక్కుని దారిదోపిడీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రేణిగుంట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు డీఎస్పీ తెలిపిన వివరాలు.. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వెంకటరమణ, శ్రీరామ్, వెంకటాద్రి, సైదాపురం మండలానికి చెందిన శరత్‌కుమార్ కొంత కాలంగా రేణిగుంట, వడమాలపేట, కరకంబాడి, రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలలో రాత్రిపూట హైవేలలో దారిదోపిడీకి పాల్పడుతున్నారు. వీరిలో శ్రీరామ్‌కు అందమైన యువతిలా వేషం వేసి హైవేపై టార్చ్‌లైటుతో లారీలను ఆపేవారు. ఎవరో అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతోందని భావించి లారీడ్రైవర్ ఆపగానే హఠాత్తుగా తక్కిన ముగ్గురూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని దాడి చేసేవారు. లారీడ్రైవర్ల నుంచి నగదు, సెల్ఫోన్లను దోచుకునేవారు. ఈనెల 16న కాట్పాడి నుంచి రైలులో వస్తున్న మహేష్ అనే యువకుడితో వీరు నలుగురూ పరిచయం పెంచుకుని అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. రేణిగుంట పోలీస్‌స్టేషన్‌లో దారిదోపిడీ ముఠా అరెస్ట్ చూపుతున్న డీఎస్పీ చంద్రశేఖర్ రేణిగుంట రైల్వేస్టేషన్లో అందరూ దిగారు. అక్కడ నుంచి మామండూరు అటవీప్రాంతంలోకి మహేష్‌ను తీసుకెళ్లి కొట్టి, అతని వద్దనున్న రూ.1600తోపాటు సెల్‌ఫోన్, సర్టిఫికెట్లను లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ అంజూయాదవ్ విచారణ చేశారు. శుక్రవారం రేణిగుంట చెక్‌పోస్ట్ రమణ విలాస్ సర్కిల్ వద్దనున్న ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో వీరు హైవేలపై దారిదోపిడీలకు పాల్పడమే కాకుండా విశాఖ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి రేణిగుంట పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి 800గ్రాముల గంజాయి, రూ.460 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక చీర, జాకెట్, టార్చిలైటు, జడ(విగ్)ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రిమాండ్‌కు తరలించారు. దారిదోపిడీ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, సిబ్బందిని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. -
హైవే జంక్షన్‌గా నకిరేకల్
నకిరేకల్ పట్టణం జాతీయ రహదారుల జంక్షన్‌గా మారనుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ పట్టణం మీదుగా కొత్తగా సిరోంచ టు రేణిగుంట జాతీయ రహదారి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పనులు సర్వే దశలో ఉన్నాయి. రహదారి పూర్తయితే నకిరేకల్ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నకిరేకల్ జాతీయ రహదారుల కూడలిగా మారనుంది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్ మరో హైవేకు కేంద్ర బిందువు కానుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరిచేం దుకు గత యూపీఏ ప్రభుత్వం మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు వయా తెలంగాణ మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు 643 కిలోమీటర్ల మేరగల ఈ హైవే జిల్లాలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. దీంతో ఆయా ప్రాంతాలతో పాటు నకిరేకల్ పట్టణం కూడా అభివృద్ధి చెందనుంది. హైవే నిర్మాణం ఇలా.. సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారిని రెండు భాగాలు విభజించారు. సిరోంచ నుంచి నకిరేకల్ వరకు(365 హైవే), నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు(369 హైవే) నిర్మించనున్నారు. కాగా సిరోంచ నుంచి నకిరేకల్ వరకు గల 365 నంబర్ హైవే తుంగతుర్తి మండలంలో ప్రారంభమై అర్వపల్లి, శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి నకిరేకల్ వరకు 72.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే 369 నంబర్ హైవే నకిరేకల్ నుంచి నల్లగొండ(తాటికల్), నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లలోకి ప్రవేశిస్తుంది. ఇది జిల్లాలో 86.2 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నిర్మాణం.. సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీదుగానే సాగుతుంది. దీంతో ఆయా గ్రామాలు, మండల కేంద్రాలు అభివృద్ధి చెందనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలకు గ్రామాల నుండే నేరుగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముమ్మరంగా సర్వే పనులు రోడ్డు నిర్మాణంలో భాగంగా హైవే అథారిటీ ఆధ్వర్యంలో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారి మధ్య నుంచి ఇరువైపులా 45ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టేందుకు సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తికాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఎగుమతులు, దిగుమతులకు ఊతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ చేపడుతున్న జాతీయ రహదారితో ఆయా రాష్ట్రాలలో సరుకుల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా జిల్లాకు మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, వెల్లులి, జొన్నలు, కందులు దిగుమతి అవుతున్నాయి. అలాగే జిల్లాలో అధికంగా పండిస్తున్న పత్తి, బత్తాయి, నిమ్మ ఎగుమతి చేస్తున్నారు. హైవే నిర్మాణంతో రవాణా ఖర్చుల భారం తగ్గడంతో పాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపార, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.