హైవే జంక్షన్‌గా నకిరేకల్
నకిరేకల్ పట్టణం జాతీయ రహదారుల జంక్షన్‌గా మారనుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ పట్టణం మీదుగా కొత్తగా సిరోంచ టు రేణిగుంట జాతీయ రహదారి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పనులు సర్వే దశలో ఉన్నాయి. రహదారి పూర్తయితే నకిరేకల్ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నకిరేకల్ జాతీయ రహదారుల కూడలిగా మారనుంది. జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్ మరో హైవేకు కేంద్ర బిందువు కానుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరుకుల రవాణా, ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరిచేం దుకు గత యూపీఏ ప్రభుత్వం మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు వయా తెలంగాణ మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు 643 కిలోమీటర్ల మేరగల ఈ హైవే జిల్లాలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. దీంతో ఆయా ప్రాంతాలతో పాటు నకిరేకల్ పట్టణం కూడా అభివృద్ధి చెందనుంది.
హైవే నిర్మాణం ఇలా..
సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారిని రెండు భాగాలు విభజించారు. సిరోంచ నుంచి నకిరేకల్ వరకు(365 హైవే), నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు(369 హైవే) నిర్మించనున్నారు. కాగా సిరోంచ నుంచి నకిరేకల్ వరకు గల 365 నంబర్ హైవే తుంగతుర్తి మండలంలో ప్రారంభమై అర్వపల్లి, శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి నకిరేకల్ వరకు 72.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే 369 నంబర్ హైవే నకిరేకల్ నుంచి నల్లగొండ(తాటికల్), నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లలోకి ప్రవేశిస్తుంది. ఇది జిల్లాలో 86.2 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది.
గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నిర్మాణం..
సిరోంచ నుంచి రేణిగుంట వరకు చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీదుగానే సాగుతుంది. దీంతో ఆయా గ్రామాలు, మండల కేంద్రాలు అభివృద్ధి చెందనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలకు గ్రామాల నుండే నేరుగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
ముమ్మరంగా సర్వే పనులు
రోడ్డు నిర్మాణంలో భాగంగా హైవే అథారిటీ ఆధ్వర్యంలో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారి మధ్య నుంచి ఇరువైపులా 45ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టేందుకు సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తికాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఎగుమతులు, దిగుమతులకు ఊతం
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ చేపడుతున్న జాతీయ రహదారితో ఆయా రాష్ట్రాలలో సరుకుల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా జిల్లాకు మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, వెల్లులి, జొన్నలు, కందులు దిగుమతి అవుతున్నాయి. అలాగే జిల్లాలో అధికంగా పండిస్తున్న పత్తి, బత్తాయి, నిమ్మ ఎగుమతి చేస్తున్నారు. హైవే నిర్మాణంతో రవాణా ఖర్చుల భారం తగ్గడంతో పాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపార, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.