నకిరేకల్: ఓ ఇంటి పెరటిలో అరటి చెట్టు.. ఆ చెట్టు గెలపైన పిట్ట గోల.. ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగు పిట్టలున్నవి. రెండు పెద్దవి, మరో రెండు పిల్లలు. గూడు చెదురుతుందనో, గోడు మిగులుతుందనో.. తెలియదు. కానీ, ఆ గూడు వైపు ఎవరైనా వస్తే చాలు అవి వెంటపడుతున్నాయి. ముక్కుతో పొడిచేస్తున్నాయి. వాటి పోరు భరించలేక ఆ ఇంటివారు తలకు హెల్మెట్లు పెట్టుకొని పెరటి వైపు వెళ్తున్నారు. వివరాలు .. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెంలో నివాసముంటున్న సుద్దాల ఉమారాణి ఇంటి పెరట్లో అరటి చెట్టు ఉంది.
అరటి గెలపైన పిట్టగూడు వెలిసింది. అరటికాయలు రోజురోజుకూ పెరగటం వల్ల పిట్టగూడు కిందపడిపోయే విధంగా ఒరిగింది. దీంతో ఉమారాణి భర్త ఓ రోజు ఆ గూడును సరిచేస్తుండగా పిట్టలు వచ్చి ఆయనను ముక్కులతో పొడవడం మొదలుపెట్టాయి. ఆయన వాటి బారి నుంచి తప్పించుకొని ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నెలరోజులుగా వారికి తిప్పలేతిప్పలు. ఇప్పటికీ ఎవరైనా ఆ ఇంటి పెరట్లోకి వెళ్తే చాలు పిట్టలు పరుగుపరుగున వచ్చి తలపై పొడుస్తున్నాయి. వాటి పోరు భరించలేక ఆ ఇంటివారు తలకు హెల్మెట్ పెట్టుకుని పెరట్లో పనులు చేసుకుంటున్నారు. పిల్లలు పెరిగి ఎగిరిపోయే వరకు తమకు ఈ బాధలు తప్పవని ఉమారాణి అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment