అమ్మ ఆగ్రహ ఫలితం - ఆ బాధలు భరించలేకనే
పనీ లేదు, ఆదాయం లేదు. నిత్యం తాగుడే. దీనికితోడు తాగుడుకు డబ్బులు కావాలని దాడులు. కన్న తల్లి అని చూడకుండా కొట్టేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. భార్య, పిల్లలకు నరకం చూపించేవాడు. చంపడమే సరైన మార్గంగా అనిపించింది.
భార్యలోనూ ఆనందం - వితంతువునైనా సంతోషమే
చాలా సంతోషంగా ఉంది. రోజూ హింసించేవాడు. అలాంటి భర్త ఉండే కన్నా చావడమే మేలు. డబ్బులు ఇవ్వాలంటూ కాలనీలో తిప్పితిప్పి కొట్టేవాడు. ఆ బాధకంటే విధవగా ఉండడమే మేలు. మా అత్త చేసిన పని మంచిదే.
కనిగిరి : కొడుకు వేధింపులకు విసిగి వేసారిన తల్లి సహనం కోల్పోయి కన్న బిడ్డను గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని బహిరంగంగా ఈడ్చూకుంటూ తీసుకెళ్లి కొండల్లో పూడ్చి వేసింది. ఈ సంఘటన పట్టణ పరిధిలోని కాశిరెడ్డి నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు.. కాశిరెడ్డి కాలనీలో నివసించే నర్సమ్మకు భర్త, చిన్న కొడుకు ఇదివరకే చనిపోయారు. పెద్ద కుమారుడు శివశంకర్(29)కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
శివశంకర్‌కు కందుకూరుకు చెందిన గోపాల కుమారితో పదేళ్ల క్రితం వివాహమైంది. తోటలకు కాపలా ఉండటంతో పాటు చేపల వేటకు వెళ్లే శివశంకర్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం రోజూ తల్లీభార్యను వేధించేవాడు. కూలీ నాలి చేసుకుని తెచ్చుకున్న డబ్బు లాక్కునే వాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. పది రోజుల క్రితం భార్య, తల్లిని చితకబాదాడు. ఆమె అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది.
మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని తల్లిని కొట్టాడు. తల్లి నర్సమ్మ వద్ద ఉన్న రూ.200లు లాక్కెళ్లాడు. విరక్తి చెందిన నర్సమ్మ.. కుమారుని హత్యకు పథకం పన్నింది. నిద్రమాత్రలు నీళ్లలో కలిపింది. కుమారుడు మద్యంతో ఇంటికి రాగా ఆ నీరు ఇచ్చింది. మద్యంలో కలుపుకుని తాగడంతో శివశంకర్ మైకంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టే గొడ్డలితో నర్సమ్మ కసితీరా నరికి చంపింది.
రాత్రంతా శవం వద్దే..
కుమారుని శవానికి తల్లి నర్సమ్మ రాత్రంతా ఇంట్లోనే కాపలాగా ఉంది. తెల్లవారిన తర్వాత కాలనీలో నుంచి శవాన్ని బహిరంగంగా ఈడ్చుకుంటూ కాలనీ శివారు ప్రాంతమైన కొండ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చింది. తాపీగా ఇంటి కొచ్చి నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుంది.
శివశంకర్‌ను చంపానని, ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవించాలని కొడలు కుమారికి ఫోన్‌లో తెలిపింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు సీఐ సుధాకరరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. శవాన్ని పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన తో పాటు ఎస్సై థెరిస్సా ఫిరోజ్ ఉన్నారు.
కొడుకు-ఖతం
Published Thu, Nov 13 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement
Advertisement