ఉమ్మడిగా పర్యాటకం
ఉమ్మడిగా పర్యాటకం
Published Sun, Sep 15 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘దక్షిణాది రాష్ట్రాల పర్యాటక సలహా మండలి’ తొలి భేటీ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు పాండిచ్చేరికి చెందిన పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర పర్యాటకశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. పర్యాటకులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయా రాష్ట్రాల్లో పర్యటించటం, వారికి సహాయంగా రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాష్ట్రాల మధ్య భిన్నంగా ఉన్న పన్నులను ఏకీకృతం చేయటం, ప్రభుత్వ నిబంధనలను సరళీకృతం చేయటం, పర్యాటకులకు వసతుల కల్పన.. తదితర అంశాలపై ఇందులో చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే ఈ ప్రాంతంలోని ఎన్నో పర్యాటక స్థలాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి చిరంజీవి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని, అలాగే పర్యాటకులకు రక్షణ కల్పించే అంశం కూడా చాలా కీలకమని ఆయన అన్నారు.
మరుగుదొడ్డి కట్టాలంటే ఫైల్ ఢిల్లీకెళ్లాలా..?
పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాలని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే అన్నారు. తమ రాష్ట్రంలో కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఓ పర్యాటక ప్రాంతంలో మరుగుదొడ్డి కట్టాలంటే ఫైలు ఢిల్లీకి వెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్, కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి రవీందర్ సింగ్, ప్రపంచ పర్యాటక మండలి చైర్‌పర్సన్ ప్రియా పాల్ పాల్గొన్నారు.
స్పందించని చిరు...: ఇదిలా ఉండగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే కేంద్ర విధానాలు మారాలంటూ కర్ణాటక మంత్రి దేశ్‌పాండే, గోల్కొండ, చార్మినార్‌ల వద్ద కబ్జాల విషయంలో మన తీరు మారాలంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీందర్‌సింగ్‌లు పేర్కొన్న అంశాలపై కేంద్రమంత్రి హోదాలో స్పందించాల్సిన చిరంజీవి మూస ఉపన్యాసానికే పరిమితమయ్యారు.
Advertisement