మెగా...దగా
=కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఉత్తిదేనా..
=కనీసం ప్రతిపాదనల జాడే లేదు
=మిగతా పర్యాటక ప్రాంతాలకు రెండో విడత నిధులు
=ఈ ప్రాంతంపై వివక్షకు ఇదే నిదర్శనం
=ముగింపునకు చేరుకున్న కాకతీయ ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘వరంగల్‌ను రాబోయే సంవత్సరంలోగా మెగా టూరిస్ట్ సర్క్యూట్‌గా గుర్తిస్తాం. భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ప్రముఖంగా ఉంచుతాం. దీంతో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడకు రావడానికి.. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి దోహదపడుతుంది. వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో విశాఖ బీచ్ కారిడర్.. తర్వాత రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో వరంగల్‌కు మెగా సర్క్యూట్‌గా అవకాశం కల్పిస్తాం.’
ఇవీ.. గత ఏడాది డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవ వేదికపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేసిన బాసలు. ఆయన ఈ హామీ ఇచ్చి... దాదాపు పదకొండు నెలలు కావస్తోంది. ఏడాది పాటు మొక్కుబడిగా సాగిన కాకతీయ ఉత్సవాలు.. ముగించేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ, ఇప్పటికీ మెగా టూరిస్ట్ సర్క్యూట్ ఎక్కడ..? కనీసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయా...? అంటే జిల్లా యంత్రాంగం సైతం ఏం చెప్పలేకపోవడం గమనార్హం.
కాకతీయ ఉత్సవాలకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ కిషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మెగా టూరిస్టు సర్క్యూట్‌కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు... ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం ఏమీ పంపించలేదని... టూరిజం విభాగం నుంచి ప్రతిపాదనలు పంపిస్తామని జవాబిచ్చారు. దీంతో వరంగల్‌ను టూరిజం సర్క్యూట్‌గా గుర్తించే ప్రక్రియ ఏ దశలో ఉందో తెలిసిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ కారిడార్‌ను మెగా టూరిస్టు సర్క్యూట్‌గా గుర్తించింది.
ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం తరఫున రూ.45.88 కోట్లు మంజూరు చేసేందుకు ఆ శాఖ మంత్రి చిరంజీవి ఆమోదం తెలిపారు. తొలి విడతగా రూ.3.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో గుర్తించిన తిరుపతి, కడప మెగా సర్య్కూట్ ప్రాజెక్టులు అమలు రెండో దశకు చేరింది. వీటికి సైతం మంత్రి చిరంజీవి రెండు నెలల కిందటే నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తిరుపతి ప్రాజెక్టుకు రెండో విడతగా రూ. 13.95 కోట్లు, కడప మెగా ప్రాజెక్టుకు రూ.11.07 కోట్లు మంజూరు చేశారు. తిరుపతి, కాళహస్తి, కాణిపాకంతో పాటు చిత్తూరు జిల్లాలోని వివిధదేవాలయాలు, పరిసర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
విజయనగర సామ్రాజ్యంలో గొలుసుకట్టులా నిర్మితమైన కోటలు, దాదాపు 21 దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కడప జిల్లాకు మెగా సర్క్యూట్ మంజూరైంది. కానీ... కాకతీయుల శిల్ప కళా వైభవానికి, కాకతీయ సామ్రాజ్యానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన వరంగల్‌ను ఇప్పటికీ మెగా సర్క్యూట్‌గా గుర్తించకపోవడం ఈ ప్రాంతంపై పాలకుల వివక్షకు అద్దం పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన నగరంగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారసత్వంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని మెగా సర్క్యూట్‌గా గుర్తిస్తే కాకతీయుల దేవాలయాలతో పాటు ఆనాటి గొలుసుకట్టు చెరువులన్నీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందే అవకాశముంది.
ఉపాధితో పాటు పర్యాటక రంగానికి చేయూతనిచ్చే ఈ ప్రాజెక్టుకు స్వయానా కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా... కనీసం కాగితాలపై ప్రతిపాదనలు సైతం ఇప్పటికీ సిద్ధం కాకపోవడం, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులకు ఏకంగా రెండో విడత నిధులిచ్చేటప్పుడు కనీసం వరం గల్ ఊసెత్తక పోవడం గమనార్హం. జిల్లా నుంచి కేం ద్ర, రాష్ట్ర కేబినెట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు సైతం ఏడాది పాటుగా కనీసం ఈ హామీని అమలు చేసే దిశగా వీసమెత్తు ప్రయత్నం చేయకపోవడం...చిరంజీవిని కలిసి ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసే చొరవ చూపకపోవడం శోచనీయం.