దాచేపల్లిలో పహారా కాస్తున్న పోలీసులు
గుంటూరు,దాచేపల్లి: దాచేపల్లిలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారంతో గ్రామంలో మూడు రోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నిందితుడు అన్నం సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందడంతో ప్రజలు శాంతించారు. బాలికపై అత్యాచారం చేశాడన్న సమాచారంతో రగిలిపోయిన గ్రామస్తులు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరికి వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరి తీయాలని ప్రజల నుంచి డిమాండ్ రాగా చివరకు సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందాడు.
బాలిక కుటుంబానికి అండగా...
బుధవారం రాత్రి 9గంటల సమయంలో బాలికపై అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రతి గుండె రగిలిపొయింది. బాలికకు, కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కదిలారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10గంటల నుంచి నిరసన హోరు ప్రారంభమైంది. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలకు చెందిన పలువురు మహిళలతోపాటుగా, యువకులు, చిన్నారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం బాధితులకు అండగా ఉండేందుకు ప్రయత్నించడంతో వారి తీరు పట్ల ప్రజలు మండిపడ్డారు. దాచేపల్లి, నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన రాస్తారోకోలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
బాధిత కుటుంబసభ్యులను మొదటిగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించాలని నేతలను ఆదేశించారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి కూడా ఎప్పటికప్పుడు నేతలతో మాట్లాడుతూ బాలిక ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డితో పాటుగా నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని బాధితురాలికి న్యాయం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురు, శుక్రవారాల్లో జరిగిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ నేతలు బాధిత కుటుంబసభ్యుల వెంటే ఉన్నారు. పలువురు ప్రజాసంఘాల నేతలు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా బాధితుల పక్షాన పోరాటం చేశారు.
48గంటలు దాచేపల్లిలో మకాం వేసిన ఎస్పీ
జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు 48 గంటలు దాచేపల్లిలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. ఆందోళన ఉధృతం కావటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు గురువారం ఉదయం 8గంటల సమయంలో దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారితో కూడా చర్చలు జరిపి శాంతింపజేశారు. ప్రజల ఆందోళనతో ప్రభుత్వం కూడా దిగివచ్చింది. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయితే శుక్రవారం సుబ్బయ్య ఉరేసుకుని మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రజల ఆగ్రహావేశాలు చల్లబడ్డాయి. అయినప్పటికీ ఎస్పీ శనివారం ఉదయం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. దాచేపల్లి పాతబస్టాండ్ సెంటర్, లైబ్రరీ సెంటర్, మసీద్ సెంటర్, నారాయణపురం ఆర్‌అండ్ బీ బంగ్లా సెంటర్, నడికుడి మార్కెట్‌యార్డు వద్ద ప్రస్తుతం పికెట్ ఏర్పాటు చేశారు. జంట గ్రామాల్లో పోలీసులు నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment