ప్రజల సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్ హరి కిరణ్
చాలా రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి అర్జీలు సమర్పించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు వంటి అంశాలను గ్రామ వలంటీర్లకు అప్పగించడంతో ఫిర్యాదుదారుల సంఖ్య కొంత తగ్గింది. ప్రధానంగా భూ సంబంధమైన సమస్యలపై అర్జీలు సమర్పించారు. మొత్తం మీద వినతులు వెల్లువెత్తాయి. సమస్యలు సావధానంగా విన్న జిల్లా అధికారులు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. – కడప సెవెన్‌రోడ్స్
సర్వే చేయించాలి
గ్రామ ఫీల్డ్ నంబరు 312లో 0.59 సెంట్ల రస్తా పోరంబోకు ఉంది. దాన్ని నేను సాగు చేస్తుం డే వాడిని. అయితే అది తన పట్టా భూమి అంటూ పోలా నారాయణరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2008లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ స్థలం రస్తా పోరంబోకు గనుక తమదేనంటూ కోర్టుకు వెళ్లగా తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పుడు మండల సర్వేయర్ అది నారాయణరెడ్డి పట్టా భూమి అని చెబుతున్నారు. జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలి. – ఎం.జయన్న, పాలెంపల్లె, కడప
నా భూమి ఇతరులకు ఆన్‌లైన్ చేశారు
సర్వే నంబరు 133/3సీలో 16.50 సెంట్లు, 133/3బీలో 26 సెంట్ల నా భూమిని పల్లపు నాగమ్మ అనే మహిళ పేరుతో అక్రమంగా ఆన్‌లైన్ చేశారు. నేను ఆ భూమిని నాగన్న అనే వ్యక్తి నుంచి 1999లో కొనుగోలు చేశాను. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకం, ఈసీ, లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. – పల్లపు వెంకటరమణ, గరుగుపల్లె, రాయచోటి మండలం
గృహాలు మంజూరు చేయాలి
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మా గ్రామంలోని 40 మంది ఎస్సీ కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అవి చౌడుమిద్దెలు కావడంతో పాతబడిపోయి వర్షానికి ఉరుస్తున్నాయి. కనుక కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేసి ఆదుకోవాలి. – కమ్ములూరి వెంకటేశు, బక్కన్నగారిపల్లె, వేంపల్లె మండలం
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలి
నా భర్త పాలగిరి ఓబుల సుబ్బయ్య మూడు నెలల కిందట మరణించాడు. నాకు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై విచారణ చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నా పేరిట జారీ చేసి ఆదుకోవాలి. – పవిత్ర కల్యాణి, అల్మాస్‌పేట, కడప
న్యాయం చేయాలి
సర్వే నంబరు 1771లో నాకు 0.47 సెంట్ల భూమి ఉంది. సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చలానా కట్టినా ఇంత వరకు ఫలితం లేదు. జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించి న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – వెంకట సుబ్బయ్య, గంగాయపల్లె, మైదుకూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment