అసెంబ్లీలో విపక్షానికి వింత పరిస్థితి
♦ కరువుకు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధం లేదా..!
♦ వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే పదే పదే మైక్ కట్
♦ జగన్ ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రులు
♦ పట్టిసీమపై మాట్లాడుతాననగానే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ప్రతిపక్షానికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కరువుపై చర్చలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయాలను మాట్లాడొద్దని స్పీకర్ కట్టడి చేయడంతో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని విస్మయపరిచింది. ప్రాజెక్టులపై మాట్లాడుతానన్న వైఎస్ జగన్‌కు పదే పదే మైక్ కట్ చేసిన స్పీకర్ అధికారపక్ష సభ్యులకు, మంత్రులకు రాజకీయ విమర్శలు చేయడానికి అవకాశం ఇవ్వడం నివ్వెరపరిచింది. కరువుపై స్వల్పకాలిక చర్చపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్న సందర్భంలో మంత్రులు జోక్యం చేసుకుని రాజకీయ విమర్శలు గుప్పించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాం లో రైతుల ఆత్మహత్యలు, పట్టిసీమ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ విమర్శించారు. మరోమంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగితే సమాధానం చెప్పలేదని విమర్శించారు.
ఆ తర్వాత స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రులు లేవనెత్తినందున పట్టిసీమ గురించీ చెబుతానన్నారు. మంత్రులు అడిగిన దానిపై వైఎస్ జగన్ ఒక్కమాట చెప్పారో లేదో స్పీకర్ మైక్ కట్ చేశారు. కరువు, నీటిపారుదల ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని జగన్ చెబుతున్నా... స్పీకర్ వినిపించుకోకుండా మైక్ కట్ చేసి, స్పీక్ ఓన్లీ ఆన్ డ్రవుట్(ఒక్క కరువు మీదే మాట్లాడాలి), నథింగ్ ఎల్స్(మరో విషయం మాట్లాడటానికి వీల్లేదు), దట్ ఎజెండా ఈజ్ ఓవర్(ఆ అంశం అయిపోయింది) అన్నారు. ఈ విషయాలు చెబుతూ మాట్లాడమని జగన్‌కు అవకాశమివ్వగా, పట్టిసీమ అనగానే ఎందుకు భయపడుతున్నారు? సందర్భం వచ్చినప్పుడు దానిపైనా మాట్లాడుతానన్నారు. దానికి స్పీకర్ తీవ్రంగా స్పందిస్తూ, కరువు మీద మాట్లాడండి.. లేదా మీ ఇష్టం... అని అన్నారు. అధ్యక్షా... పట్టిసీమ మాట ఎత్తగానే భయపడుతున్నారు. ఇక్కడేం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు అని చెబుతుండగానే మళ్లీ మైక్ కట్..! వైఎస్సార్‌సీపీ సభ్యులు మూకుమ్మడిగా నిరసన తెలియజేయగా మాట్లాడే అవకాశమిచ్చారు.
పట్టిసీమ అనగానే మైక్ కట్ చేస్తున్నారెందుకు అధ్యక్షా...! అని జగన్ ప్రశ్నించారు. అలా అంటుండగానే స్పీకర్ మైక్ కట్ చేసి ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి కాల్వ శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో స్పీకర్ జగన్‌నుద్దేశించి మాట్లాడుతూ, గంటలు... గం టలు మాట్లాడతా అంటే కుదరదు. డోంట్ డీవియేట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్(మాట్లాడాల్సిన అం శంపై పక్కకు వెళ్లొద్దు) అని అన్నారు. దానిపై జగన్ స్పందిస్తూ... ప్రజలు చూస్తున్నారు.. అధ్యక్షా...! ఎందుకు మైక్ కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దాంతో మళ్లీ మైక్ కట్ చేసిన స్పీకర్ మరోసారి కాల్వ శ్రీనివాసులును మాట్లాడాలని కోరారు. దానికి ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ దశలో వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర నీటిఎద్దడితో అలమటిస్తున్నారని, సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులకు సంబంధం ఉందం టూ విపక్ష సభ్యులు పోడియం ముందుకొచ్చి నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే అధికారపార్టీ సభ్యులు, మంత్రులు ఒక్కొక్కరుగా మాట్లాడటానికి అవకాశం రాగా, ప్రతిపక్షంపై విమర్శలుగుప్పించడంపైనే ఎక్కువ సమ యం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాల్వ శ్రీనివాసులు ఎదురుదాడి కొనసాగిస్తుం డగానే మధ్యలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని వైఎస్ సీఎంగా ఉండగా రూ.లక్షన్నర మాత్రమే పరిహారమిచ్చారని, చంద్రబాబు రూ.5 లక్షలిచ్చారని చెప్పుకొచ్చారు. అనంతరం మళ్లీ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులపై జగన్‌కు, ఆయన తండ్రి వైఎస్‌కు అభిమానం లేదని, ఓదార్పుయాత్ర చేయడం ఒక అలవాటుగా మారిందం టూ పొంతనలేని విమర్శలు గుప్పించారు. మధ్యలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు, డిప్యూటీ సీఎం మాట్లాడగానే స్పీకర్ అర్ధంతరంగా సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.