* టికెట్ల జారీ మినహా ఇకపై అన్ని సేవలూ అక్కడే: దక్షిణ మధ్య రైల్వే జీఎం
* రైళ్ల సమాచారంతో ప్రత్యేక యాప్
* టికెట్ ఉన్నవారినే స్టేషన్లలోకి అనుమతించే అంశం పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: టికెట్ల జారీ మినహా ఇతర రకాల సేవలన్నీ ఒకే చోట అందేలా రైల్వే స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాత్సవ పేర్కొన్నారు. విచారణ మొదలు ఇతర అన్ని రకాల సేవలు, ప్రయాణికుల ఫిర్యాదులు, చోరీ జరిగినప్పుడు రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ పత్రాల జారీ లాంటివన్నీ ఈ కేంద్రాల ద్వారానే జరిగేలా చూడాలని భావిస్తున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని ఈ విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి ప్రారంభించనున్నామని, స్టేషన్లలో రైళ్ల సమాచారాన్ని ప్రకటించే కేంద్రాన్ని దీనితో అనుసంధానిస్తామని చెప్పారు. సోమవారం రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీవాత్సవ మాట్లాడారు. ఇటీవల సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉన్మాది చేతిలో ఓ చిన్నారి హత్యకు గురైన సంఘటనను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్లలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకునే విషయంపై యోచిస్తున్నామని చెప్పారు. ప్రయాణ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు ఉన్నవారినే లోనికి అనుమతించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు.
జంటనగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సెల్‌ఫోన్లలో చూసుకునేలా ప్రత్యేక స్మార్ట్ ఫోన్ యాప్‌ను రూపొందించనున్నామని, దీన్ని సులభంగా ఫోన్లలోకి డైన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. దీని ద్వారా రైలు వేళలు, టికెట్ ధరలు సహా ఆలస్యం, రైళ్ల రద్దు, రూట్ మార్పు.. లాంటి సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం స్టేషన్లలో రైళ్ల సమాచారాన్ని చూపుతున్న ఎల్‌ఈడీ బోర్డులతో ఈ యాప్‌ను అనుసంధానిస్తామని, దీంతో స్టేషన్లలో అప్‌లోడ్ అయ్యే సమాచారాన్ని ఫోన్లలో తెలుసుకోవచ్చని అన్నారు.
నిధులకు కష్టమే..
ప్రస్తుతం తమ ఆదాయంలో 70 శాతం సిబ్బంది జీతాలకు, 20 శాతం ఇంధనం, ఇతర ఖర్చులకు పోతుండ గా అభివృద్ధి పనులకు 10 శాతం మాత్రమే మిగులుతోందని శ్రీవాత్సవ చెప్పారు. ఇది అభివృద్ధి విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీంతో ఇంధనం వృథాను అడ్డుకోవటం, ఇంధన ఖర్చును నియంత్రించే మార్గాలను అన్వేషించి ఖర్చును తగ్గించటం ద్వారా అభివృద్ధి పనులకు నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
రాష్ట్ర విభజన జరిగితే దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా రెండు చేయాలన్న విషయంలో రైల్వే బోర్డు ఇప్పటి వరకు తమ నుంచి ఎలాంటి సమాచారం కోరలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం సగటున గంటకు 50 కి.మీ.గా ఉన్న రైళ్ల వేగాన్ని పెంచటం, స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించటం, కాపలా లేని లెవల్ క్రాసింగుల తొలగింపు, రైళ్ల సమయపాలన, రద్దీకి తగ్గట్టుగా అదనపు బోగీల ఏర్పాటు తదితర అంశాలపై తాము దృష్టి సారించామని శ్రీవాస్తవ తెలిపారు.
రైల్వే స్టేషన్లలో ‘సింగిల్ విండో’
Published Tue, Dec 24 2013 2:22 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement