సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటుకబట్టీ కార్మికుల పిల్లల కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్మికుల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యనందించేందుకు కొత్తగా ‘పని వద్దకే పాఠశాల’ పేరుతో బడులు చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఈ బడుల్లో పిల్లలకు మాతృభాషలోనే బోధన చేపట్టనున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మెరుగైన సౌకర్యాలతో ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా రాజీవ్ విద్యామిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం 119 పాఠశాలలను ప్రారంభించనున్నారు. అవ సరం మేరకు ఈ సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
30 మందికి ఒక టీచర్
ప్రస్తుతం జిల్లాలో దాదాపు 430 ఇటుకబట్టీలున్నట్లు కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ బట్టీల వద్ద దాదాపు మూడున్నరవేల మంది పిల్లలున్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. దీంతో ముప్పై మంది పిల్లలకు ఒక పాఠశాలను ప్రారంభించేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో పాఠ శాలకు ఒక టీచర్‌ను నియమించనున్నారు. బట్టీల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఒరియా భాషలో బోధించే టీచర్లనే ఎంపిక చేస్తున్నారు. ఈ బాధ్యతను ఆర్వీఎం అధికారులు మూడు ఎన్జీఓలకు అప్పగించారు.
ఉచిత స్టడీ మెటీరియల్
ఈ పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను రాజీవ్ విద్యామిషన్ అధికారులు అందజేయనున్నారు. సోమవారం మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో కొందరికి నామమాత్రంగా మెటీరియల్ పంపిణీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈనెల 30న పిల్లలందరికీ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఒడిశా రాజ్యసభ సభ్యుడు జెపాండా హాజరుకానున్నారు.
మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేసేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాఠశాలల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
బట్టీల వద్దే బడి!
Published Mon, Jan 27 2014 11:10 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement