rajiv vidya mission scheme
-
కోటాలో కోత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాథమిక విద్యను మెరుగుపర్చేందుకు తలపెట్టిన రాజీవ్ విద్యా మిషన్ బలహీనపడింది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై శీతకన్ను వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్లో భారీగా కోత పెట్టింది. గత కేటాయింపుల్లో మిగులు నిధులను సాకుగా చూపుతూ ఈ దఫా నిధులు విడుదల చేయలే దు. దీంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పలు కార్యక్రమాలు రద్దు కాగా.. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు సైతం నిధుల సమస్య ఏర్పడింది. వార్షిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చివరగా వచ్చే వాయిదాల్లోని అరకొర నిధులు సైతం వస్తాయా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. సగానికి సగం తగ్గించి.. 2013-14 విద్యాసంవత్సరానికిగాను జిల్లా రాజీవ్ విద్యామిషన్ యంత్రాంగం రూ.305కోట్లతో వార్షిక ప్రణాళిక తయారు చేసింది. ఖర్చులను భారీగా తగ్గించుకుని ప్రణాళికను రూపొందించుకోవాలంటూ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ముందస్తుగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ఆచితూచి ప్రణాళిక రూపొందించింది. చివరకు రూ.305 కోట్లతో తయారు చేసిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా దాన్ని కేంద్రానికి సమర్పించారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మిగులు నిధులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి వార్షిక ప్రణాళిక ను ప్రాథమికంగా ఆమోదించినప్పటికీ నిధులివ్వలేదు. దీంతో జిల్లాకు రావాల్సిన కోటాలో 50 శాతానికిపైగా కోత పడింది. సాధారణ నిర్వహణ, వేతనాలకు సంబంధించి రూ.124 కోట్ల వ రకు ఆమోదం లభించింది. ఈ మేరకు స్పష్టత రావడంతో ఆర్వీఎం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈ మొత్తం కూడా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టే అదనపు తరగతి గదులు(ఏసీఆర్) కూడా ఈ సారి ప్రారంభించలేదు. గతంలో మంజూరు చేసిన వాటిలో వందకుపైగా ఏసీఆర్లు రద్దు కాగా.. పాతవాటి పనులు పూర్తి చేసేందుకు ఆర్వీఎం అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ‘నెఫ్జల్’ గల్లంతు.. రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికావిద్య కార్యక్రమం(నెఫ్జల్) మరుగున పడింది. నిధుల కేటాయింపులో కోత విధించడంతో ఈ ఏడాది నెఫ్జల్ కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎడ్యుకేషన్ గ్యారెంటీ సెంటర్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. అదే విధంగా ఉపాధ్యాయులకిచ్చే బోధన, అభ్యసన నిధులు సైతం నిలిచిపోయాయి. ముఖ్యంగా విద్యా వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు. దీంతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బాలిక విద్య కార్యక్రమం కనుమరుగైంది. బడిబయటి పిల్లలున్న చోట బోధకులను నియమించినప్పటికీ, టీచర్లు లేని చోట కనీసం వీవీలు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఇక 2014-15 విద్యా సంవత్సరానికిగాను రాజీవ్ విద్యామిషన్ అధికారులు వార్షిక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో ఈ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు గడువు 2010సంవత్సరంతో ముగిసినా.. మూడు మార్లు పొడిగించి ప్రాజెక్టును కొనసాగించారు. తాజాగా ఈ ప్రాజెక్టును రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌తో జత చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌కు ఆమోదిస్తుందా.. లేదా మరే నిర్ణయమైనా తీసుకుంటుందా చూడాలి. -
బట్టీల వద్దే బడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటుకబట్టీ కార్మికుల పిల్లల కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్మికుల పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యనందించేందుకు కొత్తగా ‘పని వద్దకే పాఠశాల’ పేరుతో బడులు చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ బడుల్లో పిల్లలకు మాతృభాషలోనే బోధన చేపట్టనున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మెరుగైన సౌకర్యాలతో ఈ బడులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా రాజీవ్ విద్యామిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం 119 పాఠశాలలను ప్రారంభించనున్నారు. అవ సరం మేరకు ఈ సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 30 మందికి ఒక టీచర్ ప్రస్తుతం జిల్లాలో దాదాపు 430 ఇటుకబట్టీలున్నట్లు కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ బట్టీల వద్ద దాదాపు మూడున్నరవేల మంది పిల్లలున్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. దీంతో ముప్పై మంది పిల్లలకు ఒక పాఠశాలను ప్రారంభించేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో పాఠ శాలకు ఒక టీచర్‌ను నియమించనున్నారు. బట్టీల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందినవారే కావడంతో ఒరియా భాషలో బోధించే టీచర్లనే ఎంపిక చేస్తున్నారు. ఈ బాధ్యతను ఆర్వీఎం అధికారులు మూడు ఎన్జీఓలకు అప్పగించారు. ఉచిత స్టడీ మెటీరియల్ ఈ పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను రాజీవ్ విద్యామిషన్ అధికారులు అందజేయనున్నారు. సోమవారం మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో కొందరికి నామమాత్రంగా మెటీరియల్ పంపిణీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఈనెల 30న పిల్లలందరికీ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఒడిశా రాజ్యసభ సభ్యుడు జెపాండా హాజరుకానున్నారు. మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేసేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాఠశాలల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
నెల్లుట్ల(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని జనగామ- సూర్యాపేట రో డ్డులోని ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మధూకర్ కథ నం ప్రకారం.. మద్దూ రు మండలంలోని ధూల్మిట్టకు చెందిన కొలిపాక మల్లయ్య (42) రాజీవ్ విద్యామిషన్ పథకంలో కాంట్రాక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, జన గామ మండలంలోని శామీర్‌పేటకు చెందిన బనిక సత్తయ్య (40) ఇదే ఆర్వీఎంలో సీఆర్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి వీరిద్దరు బైక్‌పై నెల్లుట్ల వైపు నుంచి జనగామకు వస్తుండగా ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సం ఘటనలో మల్లయ్య, సత్తయ్యలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, మృతుడు మల్లయ్యకు భార్య పద్మ, కొడుకు చక్రధర్, కూతురు చందన, సత్తయ్యకు భార్య కళావతి, కూతురు శ్వేత, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. కాగా, సంఘటన స్థలాన్ని జనగామరూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డి, లింగాలఘణపురం ఎస్సై మధూకర్, జనగామ అర్బన్ సీఐ నరేందర్ సందర్శించి, మృతదేహాలను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.