కోటాలో కోత! | Rajiv Vidya Mission scheme impaired | Sakshi
Sakshi News home page

కోటాలో కోత!

Published Fri, Feb 7 2014 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Rajiv Vidya Mission scheme impaired

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాథమిక విద్యను మెరుగుపర్చేందుకు తలపెట్టిన రాజీవ్ విద్యా మిషన్ బలహీనపడింది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై శీతకన్ను వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్‌లో భారీగా కోత పెట్టింది. గత కేటాయింపుల్లో మిగులు నిధులను సాకుగా చూపుతూ ఈ దఫా నిధులు విడుదల చేయలే దు. దీంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పలు కార్యక్రమాలు రద్దు కాగా.. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు సైతం నిధుల సమస్య ఏర్పడింది. వార్షిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చివరగా వచ్చే వాయిదాల్లోని అరకొర నిధులు సైతం వస్తాయా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది.

 సగానికి సగం తగ్గించి..
 2013-14 విద్యాసంవత్సరానికిగాను జిల్లా రాజీవ్  విద్యామిషన్ యంత్రాంగం రూ.305కోట్లతో వార్షిక ప్రణాళిక తయారు చేసింది. ఖర్చులను భారీగా తగ్గించుకుని ప్రణాళికను రూపొందించుకోవాలంటూ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ముందస్తుగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ఆచితూచి ప్రణాళిక రూపొందించింది. చివరకు రూ.305 కోట్లతో తయారు చేసిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా దాన్ని కేంద్రానికి సమర్పించారు.

అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మిగులు నిధులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి వార్షిక ప్రణాళిక ను ప్రాథమికంగా ఆమోదించినప్పటికీ నిధులివ్వలేదు. దీంతో జిల్లాకు రావాల్సిన కోటాలో 50 శాతానికిపైగా కోత పడింది. సాధారణ నిర్వహణ, వేతనాలకు సంబంధించి రూ.124 కోట్ల వ రకు ఆమోదం లభించింది. ఈ మేరకు స్పష్టత రావడంతో ఆర్వీఎం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈ మొత్తం కూడా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టే అదనపు తరగతి గదులు(ఏసీఆర్) కూడా ఈ సారి ప్రారంభించలేదు. గతంలో మంజూరు చేసిన వాటిలో వందకుపైగా ఏసీఆర్‌లు రద్దు కాగా.. పాతవాటి పనులు పూర్తి చేసేందుకు ఆర్వీఎం అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

 ‘నెఫ్జల్’ గల్లంతు..
 రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికావిద్య కార్యక్రమం(నెఫ్జల్) మరుగున పడింది. నిధుల కేటాయింపులో కోత విధించడంతో ఈ ఏడాది నెఫ్జల్ కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎడ్యుకేషన్ గ్యారెంటీ సెంటర్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.

 అదే విధంగా ఉపాధ్యాయులకిచ్చే బోధన, అభ్యసన నిధులు సైతం నిలిచిపోయాయి. ముఖ్యంగా విద్యా వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు. దీంతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బాలిక విద్య కార్యక్రమం కనుమరుగైంది. బడిబయటి పిల్లలున్న చోట బోధకులను నియమించినప్పటికీ, టీచర్లు లేని చోట కనీసం వీవీలు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.

 ఇక 2014-15 విద్యా సంవత్సరానికిగాను రాజీవ్ విద్యామిషన్ అధికారులు వార్షిక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో ఈ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు గడువు 2010సంవత్సరంతో ముగిసినా.. మూడు మార్లు పొడిగించి ప్రాజెక్టును కొనసాగించారు. తాజాగా ఈ ప్రాజెక్టును రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌తో జత చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌కు ఆమోదిస్తుందా.. లేదా మరే నిర్ణయమైనా తీసుకుంటుందా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement