కష్టమే అయినా.. ఇష్టపడి చదివా..
interview
‘సాక్షి’తో ఐసీడబ్ల్యూఏ ఆలిండియా మూడో ర్యాంకర్ తులజ భవానీ
‘కష్టే ఫలి..’ అన్నారు పెద్దలు. ఇష్టపడి చదివితే కొంచెం కష్టమనిపించినా లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోవచ్చని నిరూపించారు నగరానికి చెందిన తులజ భవానీ. ఏం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఆలోచనధోరణే ఆమెను శిఖరాగ్రాన నిలబెట్టింది. 2013లో ఐసీడబ్ల్యూఏ కొత్త సిలబస్‌లో ఆలిండియా మూడో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తులజ జాతీయస్థారుులో నగరఖ్యాతిని ఇనుమడింపజేశారు. మార్చిలో కోల్‌కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా తులజ భవానీ
‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ..
- భవానీపురం
సాక్షి : ఐసీడబ్ల్యూఏలో దేశంలోనే మూడో ర్యాంక్ సాధించిన మీకు అభినందనలు.
తులజ : ధన్యవాదాలు
సాక్షి : మీ కుటుంబ నేపథ్యం..
తులజ : మాది గుంటూరు జిల్లా తెనాలి. అక్కడి మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకున్నాను. వ్యాపారవేత్త అరుున నాన్న చంద్రశేఖర్(బాచి) నా పదేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి గృహిణి అయిన అమ్మ తారావాణి అన్నీతానై పెంచింది. ఏనాడూ ఇది చదువు.. అది చదువు అంటూ నన్ను ఒత్తిడికి గురిచేయలేదు. అందుకేనేమో ఈ స్థాయికి చేరుకున్నా.
సాక్షి : సీఏ ఎందుకు చదవాలనిపించింది?
తులజ : పదో తరగతి పూర్తయ్యూక ఇంజినీరింగ్ లేదా డాక్టర్ చదివేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొదటి నుంచి డాక్టర్ చదవాలనుకున్న నేను పదో తరగతి పూర్తయ్యూక అందరికంటే భిన్నమైన మార్గంలో వెళ్లాలనుకున్నాను. ఇంటర్‌లో ఏంఈసీ తీసుకున్నా. 2010లో విజయవాడ చేరుకుని మాస్టర్ మైండ్ కాలేజీలో చేరాను.
సాక్షి : అక్కడి నుంచి మీ చదువు ఎలా సాగింది?
తులజ : ఇష్టపడి చదివాను.. ఇంటర్‌లో 966 మార్కులతో ఎంఈసీలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాను. ఆ తరువాత సీఏ సీపీటీలో మంచి మార్కులు సాధించి అదే కళాశాలలో సీఏ పూర్తి చేశాను.
సాక్షి : ఆ తరువాత...
తులజ : సీఏ పూర్తయ్యాక ఐసీడబ్ల్యూఏ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఈ కోర్సును ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (ఐసీఎంఏ) వారు నిర్వహిస్తున్నారు. రెండూ వేర్వేరు కోర్సులు. ఒక్కోటి నాలుగేళ్లపాటు చదవాలి.
సాక్షి : ఫలితాలొచ్చాక ఏమనిపించింది?
తులజ : 2014 మార్చిలో ఫలితాలు వచ్చాయి. ఆలిండియా స్థారుులో మూడోస్థానం, మహిళల్లో మొదటి స్థానం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నాను.
సాక్షి : భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
తులజ : అనుకున్నది సాధించాను. అన్నీ అనుకూలిస్తే ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా.
సాక్షి : విష్ యూ బెస్టాఫ్ లక్.