కర్నూలు సిటీ:సంస్కరణల పేరుతో ముందస్తు ప్రణాళికలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఐదు, తొమ్మిది తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన వెంటనే జ్ఞానధార పేరుతో వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ జిల్లాలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం సైతం వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు కూడా చేసింది. అయితే విద్యాశాఖ మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తూ జ్ఞానధార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటాన్ని ఉపాధ్యా య సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
జ్ఞానధారపై కసరత్తు ఏదీ..
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2283, ప్రాథమికొన్నత పాఠశాలలు 932, ఉన్నత పాఠశాలలు 898 ఉన్నాయి. వీటిలో మొత్తం 6,41,530 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50,442 మంది పదవ తరగతి విద్యార్థులు పోను, ఇక మిగిలిన 5,91,088 మంది విద్యార్థులు 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగియక ముందే పై తరగతి పాఠ్యంశాలు బోధించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జ్ఞానధార కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయకపోవడం, మార్గదర్శకాలను రూపొందించక పోవడంతో ఉపాధ్యాయులు అమోమయానికి గురవుతున్నారు. జ్ఞానధార కింద ఇప్పటి వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఎంపికకు చర్యలు తీసుకోలేదు. ఏ స్థాయి విద్యార్థులకు శిక్షణ అవసరమో కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా గత ఏడాది సవరణాతమ్మకమైన బోధన తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎలాంటి వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏడాదంతా చదివిన విద్యార్థులు ఈ వేసవి శిక్షణపై దృష్టి సారించకపోతే ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
హాస్టల్ వసతి కల్పన
జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లతో పాటు గురుకుల పాఠశాలల్లో హాస్టల్ వసతితో కూడిన శిక్షణను మే 1వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులతో తల్లిదండ్రులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇస్తారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఇందుకు డీఈఓ, సర్వశిక్ష అభియాన్, ప్రభుత్వ డైట్ కాలేజీ డీసీఈబీలు సమన్వయంతో తయారు చేసిన ప్రణాళిక ప్రకారమే శిక్షణ ఇవ్వనున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం
ప్రభుత్వ పాఠశాలల్లో 5, 9 తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు వేసవి శిక్షణ తరగతులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. విద్యాశాఖ ముందస్తు కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో అందరికీ ఇబ్బందులు తప్పవు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
: వి.కరుణానిధిమూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
విద్యా సంవత్సర ప్రారంభంలోనే శిక్షణ ఇవ్వాలి
విద్యార్థులు పై తరగతుల్లో ప్రతిభ చూపేలా గతంలో జూన్‌లో సన్నద్ధత తరగతులు నిర్వహించే వారు. అయితే విద్యా సంస్కరణలో భాగంగా 5, 9 తరగతులకు చెందిన విద్యార్థులకు ఈ ఏడాది మే నెలలో శిక్షణ ఇవ్వాల ని తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తుంది. – రంగన్న ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment