ఆనందపేట(గుంటూరు): నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా కల్పించేంతవరకు పోరాటం సాగిస్తామని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. స్థానిక హిందూ కళాశాల సెంటర్‌లో ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కనుమూరి బాపిరాజు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జిల్లా పార్టీ పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఆడుతున్న దొంగ నాటకాలను అరికట్టాలన్నారు.
రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ వహీద్, లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి సాంబశివరావు, కొరివి వినయ్‌కుమార్, మిరియా ల రత్నకుమారి, బిట్రగుంట మల్లిక, ఈరి రాజశేఖర్, దొంత సురేష్, ముత్యాలు, జిలాని, మొగిలి శివకుమార్, రహమాన్, ఉస్మాన్, కొత్తూరి భైరవకుమార్ తదితరులు పాల్గొన్నారు.