పోలీస్ స్టేషన్‌లో పిడుగురాళ్ల నుంచి వచ్చిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణలో టీడీపీ డొంక కదులుతోంది. జననేతను అంతమొందించేందుకు అధికార పార్టీ కుట్ర పన్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలు బయట పడుతున్నాయి. నిందితుడు శ్రీనివాస్ ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. (శ్రీనివాస్ ఫోన్ నుంచి 10 వేల కాల్స్)
శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా మంగళవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన నాగూర్ వలి కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నాగూర్ వలి సోదరి సైదాబి, ఆమె మరదలు అమీజా ఉన్నారు. వీరిని మంగళవారం రాత్రి 10.15 గంటలకు సిట్ అధికారులు విచారణ కోసం వైజాగ్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో ఎంతకాలంగా పరిచయం ఉంది? పదే పదే ఎందుకు ఫోన్ చేశాడు? ఏయే విషయాలు మాట్లాడాడు? అనే దానిపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
టీడీపీ సానుభూతిపరులైన వీరిని ఆదివారం రాత్రే పిడుగురాళ్ల పోలీసులు అదుపులోకి విచారించారు. అయితే టీడీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వీరిని పోలీసులు విడిచిపెట్టారు. ఈ ముగ్గురిని సిట్ అధికారులు విచారణ చేస్తుండటంతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే కుట్ర కోణాన్ని వెలికితీసే విధంగా విచారణ జరగడం లేదని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేసిన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.
సంబంధిత కథనాలు:
Comments
Please login to add a commentAdd a comment