
సాక్షి, అమరావతి : ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెడుతుంది.
ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా ప్రవేశ పెడతారు. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమకు అందిన రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ దశల వారీగా సమగ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే.