తెలంగాణకు ప్రత్యేక పీసీసీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లడంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్పులపై పార్టీలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి ముందే తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరుగా పీసీసీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో శ్రీధర్‌బాబు హడావుడిగా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లి రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేస్తారని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణను తాత్కాలికంగా సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ విషయానికొస్తే మాత్రం పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని చేయాలనే దానిపై హైకమాండ్ పెద్దలు సమాలోచనలు జరిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి సీఎం పదవి రేసులో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించగా, ఎన్నికల సమయంలో పార్టీ పగ్గాలను చేపట్టాలన్న ప్రయత్నాలు కూడా చేశారని పార్టీలో వినిపిస్తోంది. వీరికి తోడు మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ పీసీసీ పగ్గాలపై ఆశలు పెట్టుకోవడమే కాకుండా హస్తినలో తనకున్న పలుకుబడితో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌బాబుకు అకస్మాత్తుగా హస్తిన నుంచి పిలుపు రావడం కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకే హైకమాండ్ పెద్దలుశ్రీధర్‌బాబును ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం జరుగుతోంది.
యువకుడైన శ్రీధర్‌బాబు పార్టీలో వివాదరహితుడుగా ఉండటమే కాకుండా పార్టీలో సీనియర్, జూనియర్ నేతలందరినీ కలుపుకుపోతారనే పేరుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబును నియమించే ఉద్దేశంతో ఢిల్లీకి పిలిపించార ని చెప్తున్నారు. 2011లో డీఎస్ పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలోనే శ్రీధర్‌బాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తెలంగాణపై అప్పటికి నిర్ణయం తీసుకోకపోవడం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయన పీసీసీ బాధ్యతలపై ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్లమెంటు లో బిల్లును ప్రవేశపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో శ్రీధర్‌బాబు ఈ ప్రాంతంలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. శ్రీధర్‌బాబు మాత్రం తాను పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకే ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఆహార భద్రత, ధాన్యం సేకరణ, లెవీ వంటి అంశాలపై కేంద్ర ఉన్నతాధికారులతో చర్చించినట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.