‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం | special status on ap districts protest | Sakshi
Sakshi News home page

‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం

Published Sat, Oct 24 2015 2:44 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం - Sakshi

‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం

కాకినాడ: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భారీ ర్యాలీ జరిగింది. చంద్రబాబు, మోదీల తీరును నిరసిస్తూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. జగ్గంపేట మెయిన్‌రోడ్ నుంచి పంచాయితీ కార్యాలయం వరకు భారీ  ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రకటనపై వేయికళ్లతో ఎదురు చూస్తే ప్రధాని ప్రజల నోట్లో మట్టికొట్టారని, సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో హోదా ప్రస్తావన కూడా తేలేదని విమర్శించారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
 
రాజమండ్రి సిటీలో..
ప్రధాని మోదీ తెలుగు ప్రజల నోట్లో మట్టికొట్టారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విమర్శించారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుల ఆధ్వర్యంలో నాయకులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. స్థానిక జాంపేట గాంధీబొమ్మ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ పుష్కరాలరేవులో జలదీక్ష చేశారు.  చంద్రబాబు ప్రజలను నిండా ముంచారని విమర్శించారు.
 
ప్రత్తిపాడు నియోజకవర్గంలో..
ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై వెనుకడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించారు.
 
కొత్తపేటలో..
ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ప్రకటించకుండా శంకుస్థాపనకు వచ్చి వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం గంగయ్య ఇటీవల పుష్కరాలకు వెళ్లి తీసుకొచ్చిన యమునానదీజలాలతో మహాత్మాగాంధీ విగ్రహానికి అభిషేకంచేసి నివాళులర్పించారు.
 
తునిలో..
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారని, ఆయనపై ఒత్తిడి తీసుకు రావడంలో చంద్రబాబు విఫలమయ్యూరని విమర్శించారు.
 
రంపచోడవరంలో..
శంకుస్థాపన పేరిట రూ.400కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన రాష్ర్ట ప్రభుత్వం ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదాపై ప్రధానితో ప్రకటన చేయించలేకపోరుుందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఆమె ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా చేశారు.
 
అమలాపురంలో..
పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబుల మనసు మారాలంటూ గాంధీ బొమ్మ సెంటర్‌లో ధర్నా చేశారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మోదీ, బాబుల ముసుగు తొలగిపోయిందని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
 
రాజమండ్రి రూరల్‌లో..
మాజీ ఎంపీ, రూరల్ కో ఆర్డినేటర్ గిరజాల వెంకట స్వామి నాయుడు ఆధ్వర్యంలో కడియంలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు. కాతేరులో మరో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ చేశారు.
 
రాజానగరంలో..
ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకపోయినా ప్రగతికి అవసరమైన వరాలు కురిపిస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు పార్లమెంటు మట్టి, యమునానది నీళ్లు తీసుకువచ్చి నిరాశకు గురిచేశారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రాజానగరంలో ఆమె ఆధ్వర్యంలో ప్రధాని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను తగలబెట్టేందుకు ప్రదర్శన జరుగుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు వేరే దిష్టిబొమ్మలను సిద్ధం చేసి సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.
 
పిఠాపురంలో..
పిఠాపురంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ గాంధీ విగ్రహం వద్ద మట్టి, నీరు పారబోసి వినూత్న నిరసన తెలిపారు. మోదీ ప్రజల నోట్లో మట్టికొట్టాడని నినాదాలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెట్టాడంటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రాష్ర్ట బీసీ సెల్ కార్యదర్శి వెంగళి సుబ్బారావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 
ముమ్మిడివరంలో..
ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ధర్నా చేశారు. మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
పెద్దాపురంలో..
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో ప్రదర్శన చేసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
 
అనపర్తిలో..
అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.
 
మండపేటలో..
మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కళ్లకు గంతలతో నిరసన తెలిపి వైఎస్సార్ మెమోరియల్ పార్కు వద్ద గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ర్ట రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, రాష్ర్ట కమిటీ సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. అక్కడి గాంధీ విగ్రహానికివినతిపత్రం సమర్పించారు. రాష్ర్ట కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో..
నియోజకవర్గంలోని గంగవరంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పెట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి తీరును ఎండగడుతూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
 
కాకినాడ సిటీలో..
ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మనసు మార్చాలని కోరుతూ కాకినాడ గాంధీబొమ్మ సెంటర్‌లో మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తొలుత భాస్కరా బిల్డింగ్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు బైకు ర్యాలీ చేశారు. రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీ సెల్ రాష్ర్ట కార్యదర్శి మీసాల దుర్గాప్రసాద్, జిల్లామైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
 
కాకినాడ రూరల్‌లో..
రూరల్ నియోజకవర్గం కొవ్వాడలో గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రాష్ర్ట కార్యదర్శి కాలా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
 
పి.గన్నవరంలో..
నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేట సెంటర్‌లో నాయకులు రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ రాష్ర్ట నాయకులు ముత్తాబత్తుల మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.
 
రాజోలులో..
రాజోలులో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేశారు. మరో కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో మలికిపురంలో భారీ నిరసన ర్యాలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement