
నిడమర్రు: పెట్రోల్ పంప్ దగ్గర ఆపరేటర్లు చేసే మోసాలు అనేకం ఉంటాయి. కన్ను తిప్పేలోపే మాయచేస్తారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు అరకొర చర్యలు తీసుకుని సరిపెట్టేస్తుంటారు. ఆ బంక్‌ల్లో మళ్లీ మోసాలు షరామామూలే. అంతిమంగా వినియోగదారులే నష్టపోవడం గమనిస్తుంటాం. అందుకే ఈ మోసాలను ఎలా ఎదుర్కోవాలి? నష్టపోకుండా మనం ఏమి చెయ్యాలో తెలుసుకుందాం.
దృష్టి మరల్చడం..
పెట్రోల్, డీజిల్ కొట్టించే ముందు రీడింగ్ సున్నా చేసి ప్యూయల్ నింపుతారు. అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా చేస్తారు. కానీ కొంత ఆయిల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం, లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో రావాల్సిన ప్యూయల్ రాదు. ఇంధనం నింపే సమయంలో రీడింగ్‌ను చూడాలి. మీటర్ రీడింగ్ ‘000’ నుంచి కొడుతున్నారా లేదా అనే విషయాన్ని నిశితంగా గమనించాలి.
నాజిల్‌ను పదే పదే ప్రెస్ చెయ్యడం
బంక్‌లో ఇంధనం నింపే సమయంలో కొందరు వర్కర్లు పదేపదే ప్యూయల్ నాజిల్ ప్రెస్ చేస్తుంటారు. ఇది మనకు అంతగా కనిపించదు. ఎందుకంటే మనం రీడింగ్‌పై దృష్టిపెడతాం. పంప్ పట్టుకునే చోట ఆన్‌ఆఫ్ బటన్(నాజిల్) ఉంటుంది. దీన్ని మారుస్తుండడం ద్వారా కొంత మిగుల్చుకుంటారు. బటన్ పూర్తిగా నొక్కి పట్టుకోవాలని కోరండి, లేదంటే పూర్తిస్థాయిలో పెట్రోలు రాదు. ఆటో, నాలుగు చక్రాలు వాహనాల వారు ఒక్కోసారి వాహనం దిగకుండా ప్యూయల్ పోయించుకుంటుంటారు. దీనివల్ల పెట్రోల్ బంక్ వర్కర్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది.
కల్తీపై ఓ కన్నెయ్యండిలా..
నాఫ్తాతో పెట్రోల్‌ను కల్తీ చేయడం ద్వారా లాభాలను మిగుల్చుకుంటారు. అలాగే పెట్రోల్లో కిరోసిన్ ఇతరత్రా వాటిని కూడా కలుపుతుంటారు. బండి మధ్య మధ్యలో తరచూ ఆగిపోతుంటే అది పెట్రోల్ కల్తీ ప్రభావం అని గుర్తించాలి. అలానే సైలెన్సర్ కండిషన్‌లో ఉండి దాని నుంచి ఎక్కువగా పొగ వస్తుంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు గమనించాలి.
మరిన్ని జాగ్రత్తలు ఇలా...
♦ చమురు కంపెనీ ఆధ్వర్యంలో నడపబడుతున్న పెట్రోల్ బంకులపై ఉద్యోగుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మోసాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక వేళ మోసం చేసినా కంప్లైంట్ ఇస్తే చర్యలు వేగంగా ఉంటాయి. ఇలా ఆన్‌లైన్ చేసిన బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది.
♦ ఆధునిక పంపింగ్ మెషిన్లు ఉన్న బంకుల్లో పోయించుకోవడం మంచిది. మల్టీ ప్రొడక్ట్ డిస్పెన్సర్ (ఎంపీడీ) పంపుల్లో మోసాలకు అవకాశం తక్కువ. ముఖ్యంగా పాత తరహా మెషిన్లను తేలిగ్గా ట్యాంపర్ చేయవచ్చు.
♦ పెట్రోల్‌ను నిదానంగా పోయమని కోరండి, వేగంగా పోస్తే తక్కువ పెట్రోల్ వచ్చేలా లోపల సెట్‌చేసి ఉంటారు. అందుకే వేగంగా పోస్తుంటారు. నిదానంగా పోయమని కోరడం మంచిది.
♦ మీకు అందుబాటులో ఉన్న బంకుల్లో ఒక్కోదానిలో ఒక్కోసారి నిర్ణీత పరిమాణంలోనే కొట్టిస్తూ మైలేజీ చెక్ చేసుకోవాలి. నిర్దిష్టమైన మైలేజ్ కంటే తక్కువ వస్తే అందులో మోసం జరిగినట్టే, ఇంజిన్ పనితీరులో మార్పు కనిపిస్తే కల్తీ జరిగినట్టే.
♦ పెట్రోల్ ట్యాంకు మూతను ముందుగా తీయవద్దు. మీటర్ 000 చేసిన తర్వాతే ట్యాంకు మూత ఓపెన్ చేయండి.
♦ రూ.50, రూ.100, రూ.150, రూ.200 ఈ డినామినేషన్‌లో పోయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది చిల్లర సమస్య లేకుండా ఇంత మొత్తాల్లోనే పోయించుకుంటారు. కనుక తక్కువ వచ్చేలా సెట్ చేసి ఉండవచ్చు. అందుకే లీటర్లలో కొట్టించుకోండి. లేదా రూ.111, రూ.222, రూ.333, ఈ తరహా మొత్తాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం. ఆ నగదుకు సరిపడా చిల్లర దగ్గర ఉంచుకోండి.
♦ సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. దీనివల్ల లిక్విడ్ రూపంలోని పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment