ఏజెన్సీలో ఎత్తైన ఎండ్రిక పర్వతం
ప్రకృతి అందాలకు నెలవు విశాఖ మన్యం.. కొండ లోయలు.. విరిసిన పచ్చదనం.. మదిని దోచే మేఘాలు.. జలపాతాల సోయగాలు.. వడిసే పూల పరిమళాలు.. మంచు తెరలు.. మొత్తంగా మన్యం ప్రకృతి పంచే అందాల విందు అద్భుతం. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుందే గానీ తనివి తీరదు. అందంతో పాటు ఎన్నో విశేషాల సమాహారం విశాఖ మన్యం.. పెదబయలు మండలంలోని ఎండ్రిక పర్వతం కూడా ఇందులో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతం చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తోంది.
పెదబయలు(అరకు): ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో మన్యంలోని ఓ తెగతో పన్ను వసూళ్లకు ముఠాదారి వ్యవస్థను ఏర్పాటుచేశారు. వీరితో సమావేశాలు నిర్వహించడానికి ఎండ్రిక పర్వతాన్ని వేదికగా చేసుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పరిపాలనపరమైన అంశాలను ఈ సమావేశాల్లో చర్చించేవారు. బ్రిటిష్ పాలకులు ఈ పర్వతంపై ఒక స్థూపాన్ని, విడిది భవనాన్ని కూడా నిర్మించారు. ఇవి శిథిలమైనప్పటికీ.. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలేఉన్నాయి. మన్యంలో ఎత్తైన ప్రదేశంగా పేరు గాంచిన ఎండ్రిక పర్వతం సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ రోజుల్లో ఆంగ్లేయులు ఏనుగులు, గుర్రాలు వినియోగించి ఈ పర్వతం ఎక్కి.. సమావేశాలు నిర్వహించేవారట. బ్రిటిష్ వారి హయాంలోనే ఇక్కడ రకరకాల పండ్ల తోటల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి, మామిడి, నిమ్మ, జామ, ఉసిరి వంటి పండ్ల తోటలున్నాయి. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా ఉన్నట్టు మన్యం ప్రజలు చెబుతారు.
పర్వతంపై ఊట చెరువు
ఎండ్రిక పర్వతంపై ఓ ఊట చెరువు ఉంది. ఇందులో ఏడాది పొడవున నీరు ఉంటుంది. దీన్ని ఆధారంగా మూడు కొండ గెడ్డలు ఏర్పడ్డాయి. పెదబయలు మండలంలోని అరడకోట వైపు ప్రవహించే బొంగదారి గెడ్డ, లక్ష్మీపేట వైపు ప్రవహించే రెయ్యిలగెడ్డ, కిముడుపల్లి వైపు ప్రవహించే గేదె గెడ్డకు ఈ ఊట చెరువే ఆధారం. గతంలో ఈ పర్వతం ఎత్తు, పరిసరాలపై పురావస్తు శాఖ పరిశోధనలు నిర్వహించింది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించింది. కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు.
కొండమీద చెరువు..
ఆ పేరెలా వచ్చింది..
ఎండ్రిక పర్వతం సమీపంలో ఓ చెరువు ఉంది. అందులో బంగారం, వెండి రంగులతో కూడిన ఎండ్రిక(పీత)లు ఉండేవట. అందుకే దీనికి ఎండ్రికమ్మ పర్వతంగా పిలిచేవారని పెద్దలు చెబుతారు. అలాగే ప్రజల నుంచి కప్పం వసూళ్ల చేసేందుకు బిట్రిష్ ప్రభుత్వం నియమించిన సర్ ఎండ్రిక్ అనే వ్యక్తి ఇక్కడ ఎక్కువ కాలం పరిపాలన సాగించారని, ఈ పేరే ఈ పర్వతం పేరుగా మారిందని అంటారు. కిముడుపల్లి పంచాయతీ పరిధిలోని ఈ పర్వతంపైకి లక్ష్మీపేట, వనభంగి తదితర పంచాయతీ ప్రజలు తరచూ వెళుతుంటారు. ఈ పర్వతం ఆధ్యాతి్మక ప్రాంతంగా కూడా ప్రాచుర్యం పొందింది. కార్తీక పౌర్ణమి రోజున ఎండ్రికమ్మ దేవతకు గిరిజనులు పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక వనసమారాధనలు కూడా జరుగుతాయి.
బ్రిటిష్ వారు కొండపై ఏర్పాటు చేసిన జెండా దిమ్మ
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
ఎండ్రిక పర్వతం ఎత్తైన సుందర ప్రదేశం. ఇక్కడకు వెళ్లితే ఎంతో అనుభూతినిస్తుంది. కుడాసింగి ఘాటీ నుంచి చిన్నపాటి రోడ్డు ఉంది. అయితే ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పర్వతంపై ‘వ్యూ పాయింట్’ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడ వెళ్లిన వెంటనే తిరిగిరావడం కష్టం. పర్యాటకుల కోసం విడిది ఏర్పాటు చేయాలి. పర్యాటక శాఖ దృష్టి
సారించి ఈ పర్వతాన్ని అభివృద్ధి చేయాలి.
- ఎం.అప్పలనాయుడు, కూడాసింగి, పెదబయలు మండలం
బ్రిటిష్ వారు నిర్మించిన భవనంలో మిగిలిన పునాదులు
దొరలు పిలిస్తే వెళ్లాల్సిందే..
మా గ్రామంలోనే ముఠాదారులు ఉండేవారు. కొండపై ఆంగ్లేయులకు సేవలు చేయడానికి ఇక్కడ ప్రజలను తీసుకెళ్లేవారు. అలా మా నాన్న కూడా కొండ మీదకు వెళ్లి వచ్చేవారు. ఒక్కసారి వెళితే.. 10 రోజులు అక్కడే ఉండేవారు. అక్కడ ఉన్నన్ని రోజులూ దొరలు సేవలు చేయించుకునేవారని చెప్పేవారు.
- ఓండు కరణం, రైతు, కిముడుపల్లి, పెదబయలు మండలం
ఏనుగులు, గుర్రాల మీద దొరలు వచ్చేవారు
ఆంగ్లేయులు ఏనుగులు, గుర్రాల మీద వచ్చేవారు. వనభంగి నుంచే వారికి కావాల్సిన సామన్లు పట్టుకెళ్లేవారు. ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చే వారు కాదు. ఎండ్రిక పర్వతం మీద స్థావరంలో 70 మంది వరకు దొరలు ఉండేవారు. ఎండ్రిక పర్వతం నుంచి చూస్తే.. ఏజెన్సీ మొత్తం కనిపిస్తుంది.
- పల్టాసింగి భీమన్న, రైతు, వనభంగి, పెదబయలు మండలం
పరిశీలిస్తాం..
జిల్లాలో అభివృద్ధికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి.. ఏపీ పర్యాటక శాఖ అనుమతి తీసుకుని ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎండ్రిక పర్వతం పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలన చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.
- రాంప్రసాద్, రీజనల్ డైరెక్టర్, పర్యాటక శాఖ, విశాఖపట్నం
ఎండ్రికమ్మ గుడి
Comments
Please login to add a commentAdd a comment