అమరావతి, కైకలూరు : అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం.. ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాటలివి. తిరిగి ఎన్నికల దగ్గరపడటం, దగాపడ్డా నిరుద్యోగ యువత ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌కు గోడు చెప్పుకోవడంతో నాలుగేళ్లకు ఎన్నికల హామీ గుర్తొంచింది. చేసేది లేక ఆంక్షల కత్తితో హడావుడిగా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రకటించింది. తీరా రూ.2వేలు భృతి కాస్తా రూ.1000కి దిగజారింది. ఇక ఎన్నికల ప్రణాళికలో చెప్పకుండా పది, ఇంటర్ చదివిన విద్యార్థులకు భృతి లేదంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత నిస్తేజంగా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు ఏ గ్రామ రచ్చబండపై చూసిన ఇదే చర్చ. దీనిపై ఓ నలుగురు గ్రామస్తులు మధ్య సాగిన సంభాషణ ఇది..
అప్పలస్వామి : అన్నాలైనాయా బద్రయ్య మామ? అత్తకు నలత చేసిందంటగా.. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లలేదా..?
బద్రయ్య : ఏం.. చెప్పేది అల్లుడా.. (కండువాతో ముఖం తుడుచుకుంటూ) అతి కష్టం మీద అప్పు చేసి కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టా.. కొడుకుని చదివించిన ఉద్యోగం రాలేదు.. మీ అత్తా నేను, రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని అప్పులు తీరవు. పగోడికి కూడా వద్దురా బాబు.. ఈ కట్టాలు..
స్వామి :అదేంటి మామ.. మొన్న ఎన్నికల్లో చదువుకున్న కుర్రోళ్లకు నెలకు రెండేలు ఇత్తానని చంద్రబాబు చెప్పుడుగా.. ఆ లెక్కన మీ వోడుకి నాలుగేళ్లులో మొత్తం 98 వేలు రావాలి కదా..
బద్రయ్య : ఓరి నా పిచ్చినా అల్లుడా.. లేని నదిపై వంతెన కట్టిస్తాననేవాడేరా.. ఈ రోజుల్లో పెద్ద రాజకీయ నాయకుడు. ఎన్నికల ముందు బాబుగారేమన్నారు.. ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కలికి రెండేసి వేలు బ్యాంకుల్లో వేసేత్తానన్నారు. ఇప్పుడేమో పొలం ఎక్కువుంటే ఇవ్వరంటా.. అందునా 35 సంవత్సరాలు దాటితే కుదరదంటా.. మరి ఎన్నికలప్పుడు ఈ షరతులు గుర్తుకు రాలేదా..!
స్వామి : అది నిజమేగాని మామ.. ఆ చెరువు గట్టు నుంచి హడావుడిగా వస్తుంది మన ఊరు ప్రసాదం పంతులుగారబ్బాయి రవి కదా..బద్రయ్య : అవునల్లుడు.. అతను పాలిటెక్నిక్ వరకూ చదివినట్లున్నాడు.. ఓ సారి ఇక్కడకు రమ్మను..
స్వామి : ఓ.. రవిబాబు.. ఉరుకులు పరుగుల మీద వెళుతున్నాం.. ఓ సారి ఇటురా.. బద్రయ్య మామా పిలుస్తున్నాడు..రవి : (వస్తూ.. వస్తూనే..) ఊరు పెద్దలంతా రచ్చబండపై పెద్ద మీటింగే పెట్టారే.. మాన గుడిలో నైవేద్యం సరుకులకు వెళుతున్నా.. చెప్పండి ఏంటీ పని?
బద్రయ్య : కాస్తంత కూచోవయ్యా.. రవిబాబు.. పేపర్లో ఈ రోజు నిరుద్యోగ భృతి కింద డబ్బులిస్తారని రాశారు.. అదెంటో చెప్పు..
రవి : అహా.. అదా విషయం.. చెబుతాను వినండి.. ఈ రోజుల్లో సదువుకున్నోడికన్నా.. సంతలో వ్యాపారం చేసేవాడే నయమనిపిస్తోంది. నిరుద్యోగులందరికి నెలకు రూ.2000 అని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రూ.1000 ఇస్తామంటున్నారు. దీనికి తోడు 2.50 ఎకరాలు పొలం ఉండకూదంటా. నాలుగు చక్రాలు వాహనం ఉన్నా రాదంటా. ఇక పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినోళ్లకు ఇవ్వరంటా. ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇవన్ని ఎందుకు పెట్టలేదో ఆ పెరుమాళ్లకే ఎరుక. అందరికి అర్థమయ్యిందా..
ఏసురాజు : (చుట్ట వెలిగిస్తూ).. రవి బాబు.. నీ మాటకు అడ్డు వస్తున్నానని ఏం అనుకోకూ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అనుభవించి, ఎన్నికల దగ్గర పడుతుంటేనే వీళ్లకు హామీలు గుర్తుకొస్తాయా.. నాలుగేళ్లుగా నెలకు రెండు వేలు చొప్పున మీకు 96 వేలు రావాలి కదా.. వాటి సంగతేంటి..
రవి : మంచి ప్రశ్నే అడిగావు ఏసయ్య.. మళ్లీ మన ఓట్లు కావాలి కదా మరి. హామీలన్ని ఎన్నికల వేళ గుర్తుకు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసిన యువకులకు భృతి ఇవ్వరంటా.. నిరుద్యోగులు సాయం చేసే విషయంలో ఇన్ని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదు.
ఏసురాజు : రవి బాబు ఇంకో విషయం.. మన ప్రాంతంలో రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ రూ.1.50 పైసలకు ఇస్తానని ప్రతిపక్ష నేత జగన్‌న్‌చెప్పగానే చంద్రబాబు అప్పటి వరకు వసూలు చేస్తున్న రూ.3.80లను రూ.2.00 లకే ఇస్తానని వెంటనే ప్రకటించేశారు. నిరుద్యోగులందరూ ఓ సారి జగన్‌ను వెళ్లి కలవండి.. మార్పు ఉంటుందేమో..
దావీదు (ఏసు రాజు కొడుకు) : నాన్నో.. కిందటి నెల కరెంటు బిల్లు కట్టలేదంటా.. కరెంటోళ్లు వచ్చి ఫీజు పీకేశారు.. అమ్మ టీవీలో సీరియల్ ఆగిపోయిందని శివాలెత్తుతుంది.. బేగా వచ్చేయ్..
ఏసురాజు : అమ్మ బాబోయ్ కొంప మునిగింది.. సీరియల్ ఆగిందా.. నేనయిపోయా.. ఉంటానండి.. రేపు కలుద్దాం.. అంటూ పరిగెత్తాడు. అందరూ ఇంటి ముఖం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment