ముగింపు ఎక్కడో.. కేజీహెచ్ రోడ్డులో అభాగ్యుడు
పిచ్చివాళ్ల దుర్భర జీవనం కరుణ చూపని సమాజం దారీతెన్నూ లేని జీవితం..దయనీయ రీతిలో అంతం ఒకరు.. తమలో తాము మాటాడుకుంటూ... ఎందుకో నవ్వుతూ.. అంతలోనే ఏడుస్తూ.. అలా నడుస్తూ పోతూ ఉంటారు. ఒకరు ఎవరినో శపిస్తూ.. అర్థంపర్థం లేని భాష మాట్లాడుతూ.. ఉన్మాదానికి మారుపేరులా ఉంటారు. ఇంకొకరు మాటాపలుకూ లేకుండా రోడ్డు పక్క రాయిలా పడి ఉంటారు. కొందరు అసహ్యంగా, అసభ్యంగా ప్రవరిస్తారు. కొందరు జనం మీద దాడులు చేస్తారు. ఈ దీనులు.. దురదృష్టవంతులు ఎక్కడ పడితే అక్కడ కనిపించే పిచ్చివాళ్లు. మనసు చెదిరిపోయి.. సమాజంతో బంధం చెరిగిపోయి.. తెగిన గాలిపటాల్లా.. గాలికి ఎగిరే పండుటాకుల్లా ఎక్కడో మొదలై.. ఎక్కడో కథ ముగిసిపోయే నిర్భాగ్యులు.. అభాగ్యులు.. మనలో ఎవరికీ ఏమీ కాని పిచ్చివాళ్లు.
పెదవాల్తేరు (విశాఖతూర్పు): ఎక్కడ పుట్టారో తెలియదు... ఎక్కడ పెరిగారో తెలియదు... ఇక్కడికి ఎలా వచ్చారో అంతకన్నా తెలియదు.. ఇక్కడ ఎన్నాళ్లుంటారో.. మళ్లీ ఎక్కడికి వెళ్తారో.. అసలు ఎక్కడికైనా వెళ్తారో లేదో కూడా తెలియదు. వీళ్ల గురించి ఏమీ తెలియక.. వాళ్లకూ ఏమీ తెలియక.. సమాజానికి వెలియై.. బతుకే బలియై.. జీవితమే పుస్తకంలో పేజీలు తారుమారై.. అక్షరాలు చెల్లాచెదురై.. మనసు ఆనవాళ్లు మాయమైపోయిన నిర్భాగ్యులు.. ఎక్కడ పడితే అక్కడ తారసపడే పిచ్చివాళ్లు. దేనిపైనా ధ్యాస లేక.. తమకేమవుతోందో తెలియక, ఇది తమ తనువనే స్పృహ కూడా కానరాక.. రకరకాలుగా.. వింతగా, విభిన్నంగా ప్రవర్తిస్తూ.. సమాజానికి దూరమైపోయిన దీనులు వీళ్లు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు.. ఇక్కడి వాళ్లు ఎందరో మనసు చెదిరిన మందభాగ్యులు నగరంలో అనేక చోట్ల కనిపిస్తారు. బస్టాపులు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మారుమూల ప్రాంతాలు, ఫుట్‌పాత్‌లు.. ఎక్కడైనా వీళ్లు కనిపిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలనుంచి విశాఖకు వచ్చే రైళ్లలో పిచ్చివాళ్లు వస్తున్నారు. నగరంలోని రైల్వేస్టేషన్, జ్ఞానాపురం, అక్కయ్యపాలెం, డాబాగార్డెన్స్, చినవాల్తేరు, పెదవాల్తేరు, వన్‌టౌన్, కేజీహెచ్, రామకృష్ణాబీచ్ తదితర ప్రాంతాలలో వీళ్లు బతుకు ఈడుస్తారు. చివరికి ఎక్కడో జీవన పయనాన్ని ముగిస్తారు. అనాథ మృతదేహంగా ఇక్కడి మట్టిలో కలిసిపోతారు. బిచ్చగాళ్లలా యాచించడం కూడా తెలియక ఎవరైనా జాలిపడి ఏదైనా ఇస్తే తిని, లేదంటే అలా గాలికెగిరే ఎండుటాకులా ఊరంతా సంచరిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న అనేక అపోహలు, తప్పుడు అభిప్రాయాల కారణంగా వీరికి సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకురారు. అసలు వీరి గురించి పట్టించుకోవడానికి కూడా ఇచ్చగించరు. నగరంలోని పలువురు దాతలు తరచూ ఫుట్‌పాత్‌లు, బస్టాపులలో గల పిచ్చివాళ్లకు భోజనాలు అందజేస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. కాని, ఆస్పత్రికి తరలించే విషయంలో మాత్రం అంతటా నిర్లక్ష్యం కనిపిస్తోంది.
అసలేం చేయాలి?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్లపై ఎవరైనా పిచ్చివాళ్లు కనిపిస్తే ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించాలి. అక్కడ వైద్యులు చికిత్స చేస్తారు. అనంతరం వారి సంబంధీకుల చిరునామా తెలిస్తే సమాచారం చేరవేస్తారు. లేదంటే అనాథాశ్రమాలకు తరలిస్తారు.
స్వచ్ఛంద సంస్థలు సేవకే పరిమితం
నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు తరచూ రోడ్లపై తిరిగే పిచ్చివాళ్లకు ఆహారం అందిస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు దుస్తులు, దుప్పట్లు అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు పిచ్చివాళ్లకు క్షవరం, స్నానాలు వంటి సపర్యలు చేస్తూ అభినందనలు అందుకుంటున్నాయి. కాని, ఎవరూ పోలీసుల సాయంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.
అనాథాశ్రమాలే గతి...
సాధారణంగా మానసిక ఆస్పత్రిలో ఎవరికైనా రోగం తగ్గాక సంబంధీకులకు ఆస్పత్రి వర్గాలు లేఖ లేదా టెలిఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తుంటారు.కాని, కొంతమంది ఇందుకు స్పందించకుండా నయం అయిపోయిన రోగులను తీసుకువెళ్లడానికి రావడం లేదు. దీనితో ఆస్పత్రి వర్గాలు ఇటువంటి వారిని నగరంలోని అనాథ ఆశ్రమాలలో చేర్పించిన సంఘటనలు ఉన్నాయి. అక్కడ తగిన ఆదరణ లభించక మునుపటి సమస్య తిరగబెట్టి మళ్లీ రోడ్డున పడ్డ ఉదంతాలు కూడా ఉన్నాయి.
ఇక్కడికే ఎందుకు?
సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ ఇంట్లో ఎవరికైనా పిచ్చి పడితే విశాఖపట్నం వెళ్లే రైళ్లలో బలవంతంగా ఎక్కించేస్తుంటారన్న అపప్రథ ఉంది. విశాఖలో ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఉండడమే దీనికి కారణంగా చెప్పుకుంటారు. ప్రజలో, పోలీసులో వీరికి ఆస్పత్రిలో చేర్పిస్తారులే అన్న నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైనా పిచ్చి పడితే వారిని వదిలించుకుందామని కుటుంబ సభ్యులే చూడడం అంతరించిపోతున్న మానవత్వానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అందుకే చాలా మంది మనసు గతి తప్పిన వారు తగిన వైద్యం పొందక సమస్య ముదిరిపోయి రోడ్డు పడి పూర్తిగా పిచ్చివాళ్లైపోతారు.
ఇలా చేస్తే మేలు
నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపైనా, బస్టాపులలోను, ఫుట్‌పాత్‌లపైనా పిచ్చివాళ్లు నా అన్నవాళ్లకు దూరంగా బతుకుతున్నారు. అందరూ వీరిని చూసి అయ్యో అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో అపోహల కారణంగా వీరి మీద జనం దాడులు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానసిక ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక సంచార వాహనం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిచ్చివాళ్లను ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయంలో జిల్లా యంత్రాంగంకూడా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
పోలీసులే స్పందించాలి
రోడ్లపై పిచ్చివాళ్లు కనిపించినా మేము తీసుకురావడానికి వీల్లేదు. ట్రాఫిక్ పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు మానసిక ఆస్పత్రిలో చేర్పించాల్సి వుంటుంది. అనంతరం వారికి చికిత్స చేయిస్తాం.–డాక్టర్ రాధారాణి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి,చినవాల్తేరు.
Comments
Please login to add a commentAdd a comment