కోవెలకుంటలో ప్రతిష్టించేందుకు సిద్ధం చేసిన విగ్రహం
1847 సంవత్సరం.. ఫిబ్రవరి 22వ తేదీ తెల్లవారు జామున కోవెలకుంట్ల జైలు ద్వారం తెరుచుకుంది. వందల మంది బ్రిటీషు సైనికులు మధ్యన గొలుసులతో బంధించిన ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ పక్కనే ఉన్న వేలాది జనం ‘దొరకు జై’.. అంటూ హోరెత్తారు. ‘ఉద్యమం మరణించదు.. ఎప్పటికీ జీవించే ఉంటుంది’ అంటూ జనానికి అభివాదం చేస్తూ జుర్రేరు ఒడ్డు వైపు అడుగులు వేశాడు ఆయన. అక్కడేనిలువెత్తు పాతిన ఉరి కొయ్యను ఎక్కి చిరునవ్వుతో భరతమాత ఒడిలో ఊపిరి వదిలాడు. బ్రిటీషులు ఆయన తలను 30 ఏళ్లు కోట గుమ్మానికి వేలాడదీసి ప్రజలను భయపెట్టాలనుకున్నారు. అయితే ప్రజలకు ఆయన పోరాటం మార్గమైంది. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది. రేనాటి సూర్యుడిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు : భారత దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు బావుట ఎగుర వేసిన మొట్ట మొదటి విప్లవ వీరుడు.. ఉయ్యాలవాడనరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించి బ్రిటీష్‌వారికి ధారాదత్తం చేశారు. రేనాటి ప్రాంతంలో నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలన కొనసాగేది. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్ద మల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. బ్రిటీష్‌పాలన నిరంకుశత్వ పాలనను ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో తిరుగుబాటు బావుట ఎగర వేశాడు. నరసింహారెడ్డి పోరాటానికి బ్రిటీష్ సామ్రాజ్యం గజగజ వణికిపోయింది.
తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికిచంపడమే కాక బ్రిటీష్ వారి ఖజానాను కొల్లగొట్టారు. ఆయనను పట్టించిన వారికి 10 వేల దినారాలు బహుమతి అందజేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వ తేదీన కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. ప్రజలు భయపడేలా 1877 వరకు ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు. అయితే నరసింహారెడ్డి మరణించిన వంద సంవత్సరాలకు స్వాతంత్య్రం సిద్ధించింది. నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటుంటారు. ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం ఆయన వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో పోచా బ్రహ్మానందరరెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, నరసింహారెడ్డి, తదితరులు నిర్వహిస్తుండగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే అధికారికంగా వర్ధంతిని జరుపునుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కోవెలకుంట్లలో స్మారక స్మృతి వనం
బ్రిటీష్ పాలనలో కోవెలకుంట్ల పట్టణంలోని ప్రస్తుత గాంధీసెంటర్ సమీపంలో ట్రెజరీ ఏర్పాటు చేసుకున్నారు. 1846వ సంవత్సరంలో నరసింహారెడ్డి ఈ ట్రెజరీపై దాడి చేసి నరసింహారెడ్డి 805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. ట్రెజరీపై దాడికి గుర్తుగా ఆ ప్రాంతంలో 2012వ సంవత్సరంలో పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది చిన్న ఎల్లారెడ్డి ఆర్థిక సహకారంతో నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ప్రతి ఏటా వర్ధంతిని నిర్వహిస్తున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా సైరా..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా చలన చిత్రం రూపొందిస్తున్నారు. నరసింహారెడ్డి వర్థంతిని ప్రతి సంవత్సరం మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించేవారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా నిర్వహించనుండటంతో వర్ధంతికి ప్రాధాన్యత సంతరించుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని కుందూనది ఒడ్డున రేనాటి సూర్యచంద్రుల పేరుతో స్మారక స్మృతి వనం ఏర్పాటవుతోంది. నాలుగు రోడ్ల కూడలిలో నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్రిటీష్‌వారిని గడగడ లాడించిన నరసింహారెడ్డి రేనాటి సూర్యుడిగా, దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి రేనాటి చంద్రుడిగా 2002వ సంవత్సరం తంగిరాల సుబ్బారావు రేనాటి సూర్యచంద్రుల గ్రంథాన్ని ఆవిష్కరించారు.
పాఠ్యాంశంగా చేర్చాలి:తెల్లదొరలను గడగడ లాడించిన విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రేనాటి చంద్రుడిగా వెలుగొందుతున్న బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రలను పాఠ్యాంశంగా చేర్చాలి. రేనాటి సూర్యచంద్రుల జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వారి ఖ్యాతిని దేశ నలుమూలాల వ్యాపింప చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
కామని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జాయింట్ యాక్షన్‌కమిటీ కో ఆర్డినేటర్, కోవెలకుంట్ల
నరసింహారెడ్డి నడియాడిన ప్రదేశాలనుస్మృతి వనాలుగా తీర్చిదిద్దాలి:
నరసింహారెడ్డి నొస్సం కోట కేంద్రంగా బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు బావుట ఎగుర వేశాడు. నరసింహారెడ్డి దాడి చేసిన ట్రెజరీ, పట్టుబడ్డ గిద్దలూరు జగన్నాథ స్వామి ఆలయం, ఉరితీసిన జుర్రేరు ప్రాంతం, నరసింహారెడ్డి తలను వేలాడ దీసిన ప్రాంతాలను స్మృతి వనాలతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. నరసింహారెడ్డి, రిటైర్డ్ లైబ్రేరియన్, కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment