
దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమర జ్వాల.. మన వావిలాల గోపాలకృష్ణయ్య. భరతమాత ముద్దుబిడ్డగా.. దేశ సేవలో తరించిన ధన్యజీవి. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బ్రిటీష్ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్య. నేడు ఆ మహనీయుడి 114వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సత్తెనపల్లి: స్వాతంత్య్రోద్యమం దేశ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం. ఎందరో మహానుభావులు భరతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఒకరు. చేతికి సంచి తగిలించుకొని సాదాసీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. బ్రిటీషు పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు. 1906 సెప్టెంబర్ 17న సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాల్గో సంతానంగా ఆయన జన్మించారు. క్వింట్ ఇండియా ఉద్యమం మొదలుకొని మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. పల్నాడు అపర గాంధీగా పేరుగడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
ప్రజాసేవకు చేరువ..
స్వాతంత్య్రం వచ్చాక ప్రజాసేవకు వావిలాల గోపాలకృష్ణయ్య మరింత చేరువయ్యారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడటంతో ఇక్కడ పోటీ చేసి తొలి శాసన సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించారు. 1952, 1955, 1962, 1972 ఎనికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా విజయం సాధించి 19 ఏళ్ల పాటు ప్రజా సేవలో నిలిచారు. ఆయన కృషి ఫలితంగానే శాతవాహన నూలు మిల్లు, ఫణిదం చేనేత సహకార సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయ్యాయి. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు. మద్యపాన నిషేధ ఉద్యమ సంస్థ బాధ్యుడిగా, గ్రంథాలయ ఉద్యమ రథ సారధిగా, దళిత, గిరిజనోద్ధరణ ఉద్యమ నాయకుడిగా ఆయన ముందు నడిచారు. పద్మభూషణ్‌తో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలను అందుకున్నారు. 2003 ఏప్రిల్ 29న అనారోగ్యంతో వావిలాల గోపాలకృష్ణయ్య తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్య్ర సమరయోధుడి గుర్తుగా..
వావిలాల గోపాల కృష్ణయ్యకు రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు పక్కన ఐదెకరాల్లో ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట నీటిమూటైంది. ప్రసుత్త ఎమ్మెల్యే అంబటి రాంబాబు గత ఏడాది ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్వయంగా శుభ్రం చేయించి వావిలాల జయంతి నిర్వహించారు. దీంతో అప్పటి సీఆర్‌డీఏ అధికారుల్లో కనువిప్పు కలిగి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అయితే వావిలాల ఘాట్‌కు ఎన్టీఆర్ గార్డెన్‌గా నామకరణం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడి ఘాట్ ఆనవాళ్లు కనిపించకుండా చేసేలా గత పాలకులు వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు చొరవ తీసుకుని ఆ ప్రాంతానికి గతంలో మాదిరిగానే రికార్డుల్లో ఉన్న వావిలాల ఘాట్ (స్మృతి వనం)గా నామకరణం చేయించేలా చేశారు.
కాంస్య విగ్రహం ఏర్పాటు
వావిలాల శత జయంతిని పురస్కరించుకొని 2006 సెప్టెంబర్ 14వ తేదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నాటి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, నాటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, నాటి సహకార శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నాటి శాసన సభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో వావిలాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్ నుంచి అచ్చంపేట వెళ్లే రోడ్డులో కాలనీకి వావిలాల వారి వీధిగా పేరు పెట్టారు.
వావిలాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి
స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. సమాజ సేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే వారు అరుదుగా ఉంటారు. ఆజన్మాంతం వావిలాల బ్రహ్మ
చారిగా ఉండి ప్రజా సేవలో తరించారు. విశ్వవిద్యాలయాల స్థాపన, ప్రాజెక్ట్‌ల నిర్మాణం, మద్యపాన నిషేధానికి అనేక ఉద్యమాలు నిర్వహించారు. అలాంటి గొప్ప నాయకుడి జీవిత విశేషాలు భవిష్యత్తు తరాలకు తెలపకపోతే ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ నెల 17న వావిలాల 114వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. – అంబటి రాంబాబు, ఎమ్మెల్యే, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment