అడగకుండానే అన్నీ ఇచ్చిన దయాగుణం..
నిరుపేదలకు అది స్వర్ణయుగం..
జలయజ్ఞంతో కరువు నేల సస్యశ్యామలం..
రేపటి భవిష్యత్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ వరం..
ఆగుతున్న గుండెలకు ఆరోగ్యశ్రీ మహాభాగ్యం..
పథకాలతో ఊరూరా సంక్షేమ సంతకం..
జనహృదయాల్లో నిలిచిన దైవం..
చరితలో నీ జ్ఞాపకం శాశ్వతం..
ప్రజా నాడి పట్టిన డాక్టర్
కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్య పథకాలంటే దేశంలో వెంటనే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలేనంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ కాదు కదా ప్రైవేటు ఆసుపత్రుల మెట్లు ఎక్కడానికి కూడా భయపడే పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా చేయించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు. అత్యవసర వైద్యం అందించేందుకు గాను 108 అంబులెన్స్‌లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 104 సేవలు ఆయన హయాంలో వచ్చిన పథకాలే. స్వయంగా ఆయన డాక్టర్ అయినందున పేదల కష్టాలేంటో ఆయన గుర్తెరిగి ఈ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెలో దేవుడయ్యాడు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో 20 దాకా ప్రైవేటు ఆసుపత్రులతో పాటు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ పథకం వర్తింపజేశారు.
పెద్దాసుపత్రిలో గుండెకు ఊపిరి
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆసుపత్రికి వచ్చారు. గుండె జబ్బుల విభాగంలో కేథలాబ్ యూనిట్ అవసరం అవుతుందని వైద్యులు చెప్పగానే అంగీకరించి ఏర్పాటు చేశారు. ఇది 2008లో ప్రారంభమై ఇప్పటికీ నిరంత రాయంగా హృద్రోగులకు సేవలు అందిస్తోంది. ఈ యంత్రం ద్వారా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంట్లు వేయడం వంటి సేవలు అందిస్తున్నారు. గతంలో ఈ సేవలు పొందాలంటే రోగులు హైదరాబాద్ వెళ్లేవారు.
8మాతాశిశు భవనం వైఎస్ చలువే
ప్రస్తుతం పెద్దాసుపత్రిలోని మాతాశిశు భవనాలు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే నిర్మించారు. 2006లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 2007లో దీని నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఇప్పుడున్న చిన్నపిల్లల విభాగం భవన నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో పాత భవనంలో ఉన్న చిన్నపిల్లల విభాగంలో సౌకర్యాలు లేక చిన్నపిల్లలు చనిపోతుండటంతో స్పందించిన అధికారులు ఉన్నఫలంగా కొత్త భవనంలోకి వార్డును మార్చారు. గైనిక్ కోసం నిర్మించిన ఈ విభాగంలో పిల్లల వార్డు చేరడంతో మళ్లీ గైనిక్ విభాగానికి టెండర్లు పిలిచారు. ఆరేళ్లకు పైగా ఈ భవనం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభమై ఉత్తమ సేవలు అందిస్తోంది.
చికిత్సకు ఎంత ఖర్చయినా వైఎస్‌ఆర్ ఇచ్చేవారు
నా కుమారుడు అశోక్‌కుమార్ నాయక్‌కు పుట్టుకతో గుండెజబ్బు, బుద్ధిమాంధ్యం ఉంది. హైదరాబాద్ ఇన్నోవా హాస్పిటల్‌లో 2010లో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించాము. అయితే వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరించేది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రూ.1. 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. మాకు మాత్రం రూ.6.80 లక్షలు ఖర్చు అయింది. దాతల ద్వారా సహాయం పొంది వైద్యం అందించాము. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడు.
– చంద్రపాల్ నాయక్, జమ్మినగర్‌తండా, వెలుగోడు
చేనేతకు ఆ‘ధార’మై.. వైఎస్‌ఆర్ హయాంలో రూ.7.90 కోట్ల రుణాలు మాఫీ
కర్నూలు(అర్బన్): చేనేత రంగానికి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేయూత అందించారు. చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కార్యాక్రమాలను చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న నలుగురు చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల ప్రకారం మంజూరు చేశారు. వైఎస్ మృతి అనంతరం జిల్లాలో ఆరుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటికీ నయాపైసా విడుదల చేయలేదు. రైతుల రుణమాఫీతో పాటు చేనేతల రుణాలు కూడా మాఫీ అయి న నేపథ్యంలో జిల్లాలో సహకార, వ్యక్తిగత రుణాలు రూ.7,90,54,288 మాఫీ అయ్యాయి. జిల్లాలోని 18 సహకార సంఘాల్లోని సభ్యులకు సంబంధించి రూ.4,53,17,935 మాఫీ అయ్యాయి. అలాగే 1942 మంది చేనేత కార్మికులకు వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత రుణాలు రూ.3,37,36,353 మాఫీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా డా.వైఎస్‌ఆర్ ఉన్న సమయంలో 50 ఏళ్లకే చేనేత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4,417 మంది నేత కార్మికులకు పెన్షన్ అందుతోంది. అలాగే నిరుపేద చేనేత కార్మికులను గుర్తించి వారికి అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) పథకం కింద నెలకు 35 కేజీల బియ్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా వీవర్స్ కార్డులు అందించారు. ఇప్పటికి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 115 మంది ఈ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటున్నారు. గృహ నిర్మాణానికి విడుదల చేసే మొత్తానికి చేనేతలకు అదనంగా రూ.20 వేలను విడుదల చేశారు.
పేదోడి సొంతింటి కల.. నెరవేరిన వేళ
కర్నూలు(అర్బన్): ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మదిలో పురుడు పోసుకున్న ‘ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం’ ద్వారా జిల్లాలో లక్షల మంది నిరుపేదలు ఇంటి యజమానులయ్యారు. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 3.28 లక్షల గృహాలు మంజూరు చేసి రూ.1013 కోట్లు ఖర్చు చేశారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ గృహాలు మంజూరు కావడంతో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మొదటి విడతలో జిల్లాకు 1,22,225 గృహాలు మంజూరు కాగా, ఈ గృహాల నిర్మాణాలకు రూ.36009.37 లక్షలు వెచ్చించారు. రెండవ విడతలో 1,21,039 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.40446.74 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మూడవ విడతలో 61,143 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.24909.76 లక్షలను వెచ్చించారు. అలాగే 2004–05 ఆర్థిక సంవత్సరం నుంచి 2009–10వ ఆర్థిక సంవత్సరం వరకు ఇందిరా ఆవాజ్ యోజన పథకం ద్వారా 23,396 ఇళ్లను మంజూరు చేసి ఈ ఇళ్ల నిర్మాణాలకు రూ.63 కోట్లు ఖర్చు చేశారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగు న్నరేళ్లలో ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 74,121 గృహాలను మాత్రమే మంజూరు చేయగా, ఇప్పటి వరకు 31,135 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన గృహాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి.
30 ఏళ్ల కల నెరవేరింది
ఇళ్లులేక 30 ఏళ్లుగా పూరి గుడిసెలోనే జీవనం సాగిస్తూ వచ్చాం. మహానేత రాజశేఖర్‌రెడ్డి వచ్చిన వెంటనే నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లో రూ.35 వేలు రుణం వచ్చింది. సొంత స్థలం ఉండడంతో దానిలో ఇల్లు నిర్మించుకున్నాను. నా ఇల్లు ఆయన పుణ్యమే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. – మగ్బుల్, శిరివెళ్ల
Comments
Please login to add a commentAdd a comment